జిల్లాను జాతీయ స్థాయిలో నిలిపిన జిల్లా కలెక్టర్ కు చిరు సన్మానం

  • జిల్లా కలెక్టర్ ను అభినందించిన జనసేన, సిపిఎం, సిపిఐ (ఎం.ఎల్ ), రైతు కూలీ సంఘం (ఆ.ప్ర). నాయకులు
  • పేదల డాక్టరు వెంకట్రావు కు సహాయం చేయండి
  • రోగాల సీజన్లో జిల్లాను అప్రమత్తం చేయండి
  • మలేరియా డెంగ్యూ జ్వరాలకై జిల్లా ఆస్పత్రిలో చికిత్స జరిగేలా చూడాలి

పార్వతీపురం: అనతి కాలంలో మన్యం జిల్లాను నాలుగుసార్లు జాతీయస్థాయిలో నిలిపినందుకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను అఖిలపక్షం నాయకులు అభినందించారు. గురువారం సాయంత్రం జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు, రైతు కూలీ సంఘం (ఆంధ్ర ప్రదేశ్) నాయకులు పి. శ్రీను నాయుడు, మోనంగి భాస్కరరావు, సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి, సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ నాయకులు పి.సంగం తదితరులు జిల్లా కలెక్టర్ ను కలిసి ఇటీవల నీతి అయోగ్ ఆశావాహ అవార్డుతో పాటు, పారిశుద్ధ్యం విషయంలో లభించిన జాతీయ స్థాయి అవార్డులకు గాను అభినందించారు. అనంతకాలంలోనే జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తున్నందుకు వారు అభినందనలు తెలిపారు. తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, అన్ని రంగాల్లో జిల్లాను ముందు ఉంచాలని కోరారు. ముఖ్యంగా రోగాలు సీజన్లో జిల్లాను అప్రమత్తం చేయాలని, మలేరియా, డెంగ్యూ జ్వరాలకు పార్వతీపురం మన్యం జిల్లా ఆస్పత్రిలో చికిత్స లభించేలా చర్యలు చేపట్టాలని కోరారు. తాగునీరు, విద్య, వైద్యం పట్ల తగు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల డాక్టర్ గా పేరుపొందిన డాక్టర్ డి. వెంకట్రావు ఇటీవల గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని, అతన్ని సీతంపేట నుండి పార్వతీపురం కు బదిలీ చేయాల్సిందిగా అభ్యర్థించారు. కరోనా సమయంలో కుటుంబానికి నష్టం జరిగినప్పటికి ఆయన ప్రజల పక్షాన నిలిచి పోరాడారన్నారు. గిరిజనులు, పేదల పక్షాన అహర్నిశలు శ్రమించిన వైద్యుడు కష్టంలో ఉన్నారని ఆయన్ని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అతని ఆరోగ్యం కుదుటపడేంతవరకు పార్వతీపురంలో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా దుశ్శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో జిల్లాను జాతీయ స్థాయిలో నిలపగలిగామని, ముందు ముందు మరింత శ్రమిస్తామని తెలిపారు.