పట్టణాల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి: కేటీఆర్‌

విశ్వ వ్యాప్తంగా పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో తెలంగాణలో 58 శాతం జనాభా పట్టణాల్లోనే ఉంటుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అందువల్ల పట్టణాల్లో మౌలిక వసతులపై దృష్టి పెట్టామని ఆయన తెలిపారు. పట్టణాల్లో భవన నిర్మాణ అనుమతుల కోసం కొత్తగా రూపొందించిన టీఎస్‌ బీపాస్‌ వెబ్‌సైట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరిపాలనను వికేంద్రీకరించేలా నిర్ణయాలు తీసుకుటున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా మెరుగైన సౌకర్యాలు కల్పించవచ్చని చెప్పారు. ఇందులో భాగంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌ సాహసోపేతమైన నిర్ణయమని చెప్పారు. గతంలో రోజులు, నెలల కొద్ది సాగిన భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇప్పుడు క్షణాల్లో పూర్తవుతుందన్నారు. ధరణి ద్వారా పైసా లంచం ఇచ్చే పనిలేకుండా సామాన్యులకు సేవలు అందుతున్నాయని చెప్పారు.

టీఎస్‌ బీపాస్‌ ద్వారా అద్భుతమైన సంస్కరణ తీసుకొచ్చామని వెల్లడించారు. ప్రజలకు మేలు జరిగేలా టీఎస్‌ బీపాస్‌ వెబ్‌సైట్‌ తీసుకొచ్చామన్నారు. 75 గజాల వరకు స్థలం ఉంటే ఎలాంటి అనుమతి అవసరం లేదని, రిజిస్ట్రేషన్‌ ఉంటే సరిపోతుందని చెప్పారు. 75 నుంచి 600 గంజాల వరకు ఇంటిస్థలం ఉంటే స్వీయధ్రువీకరణ ద్వారా అనుమతులిస్తామని తెలిపారు. నిర్దేశిత గడువులోగా అనుమతులు, ధ్రువపత్రాలు వస్తాయని ప్రకటించారు. 600 గజాలపైన ఉంటే స్వీయధ్రువీకరణ ద్వారా దరఖాస్తు చేసుకుంటే 21 రోజుల్లో అనుమతులు వస్తాయని ఆయన వెల్లడించారు.