అన్నవరంలో విశేష పూజలు

అన్నవరం దేవస్థానంలో శనివారం నుంచి దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 17 నుంచి 25 వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా సత్యదేవుని క్షేత్ర రక్షకులు వనదుర్గ, కనకదుర్గ అమ్మవార్లను రోజుకో రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 17న బాలా త్రిపుర సుందరీ దేవి, 18న అన్నపూర్ణాదేవి, 19న శారదాదేవి, 20న లక్ష్మీదేవి, 21న గాయత్రీ దేవి, 22న సరస్వతీ దేవి, 23న దుర్గా దేవి, 24న మహిషాసురమర్ధినీ దేవి, 25న రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవార్లను అలంకరించనున్నారు. 25న రాత్రి 7 గంటలకు కొండపై రామాలయం పక్కనే జమ్మి చెట్టు వద్ద శమి పూజ చేయనున్నారు. ఉత్సవాల సందర్భంగా విజయవాడకు చెందిన పి.చిరంజీవిరావు, వెంకటరమణలు రూ. 2.77 లక్షల విలువైన పట్టు చీరలు, పంచెలు అందించారని ఆలయ అధికారులు తెలిపారు.