స్పుత్నిక్‌ లైట్‌ ఒక్క డోసుతో కరోనాకు చెక్‌

స్పుత్నిక్‌ లైట్‌ ఒక్క డోసుతో కరోనాకు చెక్‌పెట్టవచ్చంటూ రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డిఐఎఫ్‌) ప్రకటించింది. ప్రస్తుతం ఏ వ్యాక్సిన్‌ అయినా సమర్థవంతంగా పనిచేయాలంటే నిర్ణీత కాలవ్యవధిలో రెండు డోసులు ఇవ్వాల్సిందే. అయితే స్పుత్నిక్‌ లైట్‌ ఒక్కడోసుతో వైరస్‌ను అడ్డుకోవచ్చంటూ ఆర్‌డిఐఎఫ్‌ చెబుతోంది. ఈ ఒక్కడోసు 78.6శాతం నుండి 83.7శాతం సమర్థతతో పనిచేస్తున్నట్లు ఆర్‌డిఐఎఫ్‌ సిఇఒ కిరిల్‌ దిమిత్రివ్‌ వెల్లడించారు. అర్జెంటీనాలో కొంతమందిపై వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ జరిపినట్లు తెలిపారు. బ్యూనోస్‌ ఏరియస్‌ ప్రావిన్స్‌(అర్జెంటీనా) ఆరోగ్య మంత్రిత్వశాఖ సేకరించిన గణాంకాల ప్రకారం 60-79 సంవత్సరాల వయసు కలిగిన 1.86లక్షల మందికి స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ను ఇచ్చారు. వారిలో 40వేల మందికి స్పుత్నిక్‌లైట్‌ ఒక డోస్‌ను మాత్రమే ఇచ్చారు. స్పుత్నిక్‌ ఒక డోస్‌ తీసుకున్న వారిలో ఇన్‌ఫెక్షన్‌ రేటు 0.44శాతంగా ఉండగా, అసలు వ్యాక్సిన్‌ తీసుకోని వారిలో ఇన్‌ఫెక్షన్‌ రేటు 2.74 శాతంగా ఉంది. ఇదే ఫార్ములా ఉపయోగించి వ్యాక్సిన్‌ సామర్థ్యాన్ని నిర్ధారించారు. స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న వారిలో వ్యాక్సిన్‌ సామర్థ్యం 78.6 శాతంగా ఉండగా, స్పుత్నిక్‌లైట్‌ తీసుకున్న వారిలో ఏకంగా 83.7 శాతం సామర్థ్యం ఉన్నట్లు గుర్తించారు. దీంతో స్పుత్నిక్‌లైట్‌ కూడా ప్రభావవంతంగా పనిచేస్తోందని ఆర్‌డిఐఎఫ్‌ సిఇఒ కిరిల్‌ దిమిత్రివ్‌ ప్రకటించారు. సగటున 79.4శాతం సామర్థ్యంతో స్పుత్నిక్‌ లైట్‌ పనిచేస్తున్నట్లు ఆయన వివరించారు.