రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి!

  • రోడ్డున పడుతున్న బాధితు కుటుంబాలను ఆదుకోవాలి
  • మైనర్లు, మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోవాలి
  • ఆటోలు, కార్లు, లారీలు డ్రైవర్లకు తరచూ కౌన్సిలింగ్ నిర్వహించాలి
  • ప్రమాదాలు జరిగే స్థలాలు వద్ద హెచ్చరికలు ఏర్పాటు చేయాలి
  • కుర్రకారు, గంజాయి బ్యాచ్ ల స్పీడ్ కు బ్రేకులు వేయాలి
  • హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి చేయాలి
  • రోడ్డు గోతులను పూడ్చే చర్యలు చేపట్టాలని కోరిన జనసేన పార్టీ నాయకులు

పార్వతిపురం: మన్యం జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. బుధవారం పార్వతీపురంలో ఆ పార్టీ నాయకులు వంగల దాలినాయుడు, అన్నాబత్తుల దుర్గ ప్రసాద్, వెంకటరావు తదితరులు విలేకరులతో మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఆయా ప్రమాదాలు బారిన పడిన బాధితు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. ప్రశాంతంగా సాగే కుటుంబ జీవనయానం ఒక్కసారిగా ఇంటికి ఆధారమైన వ్యక్తి మృత్యువాత పడడం, వికలాంగుడు కావడంతో ఆయా కుటుంబాలు చితికి పోతున్నాయన్నారు. కాబట్టి సంబంధిత శాఖలకు చెందిన అధికారులు మానవత్వం తో తగు చర్యలు చేపట్టాలని కోరారు. దీనిలో భాగంగా అధికంగా మైనర్లు, మద్యం తాగి వాహనాలు నడిపే వారి వలన రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఆటోలు, లారీలు, కారు డ్రైవర్ల వల్ల కూడా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. కాబట్టి విధిగా కనీసం నెలకు ఒకసారి అయినా సంబంధిత శాఖ అధికారులు వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. అలాగే ఆటోలు లారీలు కార్లు స్పీడ్ కు కళ్లెం వేయాలన్నారు. ముఖ్యంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న స్థలాలు, డేంజర్ జోన్లుగా గుర్తించి వాటి వద్ద హెచ్చరికలు ఏర్పాటు చేయడంతో పాటు ఆయా ప్రాంతాలకు వాహనాలు వచ్చే సమయానికి వేగం తగ్గేలా, నిదానం పెరిగేలా తగు కఠిన శిక్ష పడేలా ప్రణాళికలు సంబంధిత అధికారులు రచించాలన్నారు. ముఖ్యంగా కుర్ర కారు, గంజాయి బ్యాచ్ లు పరిమితికి మించి ప్రయాణాలు, అతివేగంతో బళ్ళు నడపడం వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కుర్రకారు స్పీడ్ కు బ్రేకులు వేయాలన్నారు. మైనర్లు, కుర్ర కారు డ్రైవింగ్ పై నిత్యం తనిఖీలు చేపట్టి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. హెల్మెట్లు సీట్ బెల్టులు తప్పనిసరి చేయాలన్నారు. ఇక రోడ్డు ప్రమాదాలకు దాదాపు కారణమవుతున్న ఆయా రోడ్లో ఏర్పడిన పెద్దపెద్ద గోతులను పూడ్చే చర్యలు సంబంధిత పాలకులు, అధికారులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. మానవతా దృక్పథంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న తీరును జరుగుతున్న స్థలాలను గుర్తించి సంబంధిత పోలీసు, ఆర్టీవో, ఎక్సైజ్ తదితర శాఖలకు చెందిన అధికారులు పాత ప్రణాళికల స్థానంలో కొత్త ప్రణాళికలు రచించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టి బాధిత కుటుంబాల్లో ఆనందం నింపాలని వారు కోరారు.