విద్యార్థుల మరణాలు లేకుండా చూడాలి..!

  • వసతి గృహాలలో మెనూ సక్రమంగా అమలు చేయాలి
  • వైద్య శిబిరాలు నిర్వహించి, ఏఎన్ఎం లను నియమించాలి
  • మృతి చెందిన వైఎస్ వలస పాఠశాల విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి
  • మినరల్ వాటర్, దోమతెరల సదుపాయం కల్పించాలి
  • ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ ని కోరిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం నియోజకవర్గం: పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో గల ఆశ్రమ పాఠశాలలు/కళాశాలకు చెందిన వసతి గృహాల విద్యార్థులు మృత్యువాత పడకుండా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. శుక్రవారం జనసేన పార్టీ జిల్లా నాయకులు వంగల దాలి నాయుడు, అన్నా బత్తుల దుర్గాప్రసాద్ లు పార్వతీపురం ఐటిడిఏ డిప్యూటీ డైరెక్టర్ కే. శ్రీనివాస్ రావుని కలిసి రోగాల సీజన్లో విద్యార్థులకు అందించాల్సిన ఆహార, వైద్య సదుపాయాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ ఏటా రోగాలు సీజన్లో ఐటీడీఏ పరిధిలోని వాసతి గృహాల విద్యార్థులు మృత్యువాత పడటం సర్వసాధారణంగా మారిందన్నారు. ఈ ఏడాది కూడా ఇప్పటికే వై. ఎస్.వలస పాఠశాలలో పదో తరగతి విద్యార్థి జ్వరానికి మృతి చెందడం బాధాకరమన్నారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అలాగే వసతి గృహాలలో మెనూ సక్రమంగా అమలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తే ఇమ్యూనిటీ పెరిగి రోగాలను తట్టుకునే శక్తి చేకూరుతుందన్నారు. వైద్య శిబిరాలు నిర్వహించి, ఏఎన్ఎం లను నియమించాలన్నారు. మినరల్ వాటర్ తో పాటు దోమతెరలు సదుపాయం కల్పించాలన్నారు. అలాగే వసతి గృహాల నుండి ఇళ్లకు వెళ్లే విద్యార్థులను ఆయా గ్రామాలలో వైద్య సిబ్బంది పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఏజెన్సీలో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, పచ్చకామెర్లు, కండ్ల కలకలు తదితర రోగాలు విజృంభించాయని వాటిపట్ల విద్యార్థులను కాపాడాలని కోరారు. ఈ సందర్భంగా వారు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డిడి కే. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇప్పటికే వైద్య సదుపాయాలు అందిస్తున్నామన్నారు. అలాగే మినరల్ వాటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేసేందుకు ప్రభుత్వానికి నివేదించడం జరిగిందన్నారు.