మెగాస్టార్ ను కలిసిన సుధాకర్‌ దంపతులు

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి ఎంతోమందిని ఇన్ఫిరేషన్. ఆయన ఇన్ఫిరేషన్‌తో ఇండస్ట్రీకి వచ్చిన హీరోలు చాలా మందే ఉన్నారు. శ్రీకాంత్, రవితేజ మొదలు ఇప్పటి హీరోలలో సత్యదేవ్‌, కార్తికేయ వంటి వారు చిరంజీవిని ఇన్ఫిరేషన్‌గా తీసుకొని తమ సత్తాను చాటుతున్నారు. ఇక మరోవైపు చిరంజీవి కూడా ఎంతోమందిని ప్రోత్సహిస్తూ వస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా యువ నటుడు సుధాకర్.. మెగాస్టార్‌ని కలిశారు. తన భార్య హారిక సందెపోగుతో కలిసి మెగాస్టార్ ఇంట్లోనే కలిశారు. ఈ సందర్భంగా సుధాకర్ దంపతులకు చిరంజీవి సాదరస్వాగతం పలికారు. అంతేకాదు భవిష్యత్‌లోనూ సుధాకర్‌కి తన సాయం ఉంటుందని చిరంజీవి భరోసాను ఇచ్చారు.

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన సుధాకర్.. నా జీవితంలో ఇదొక మెగా మూమెంట్. అన్నయ్య ఇంట్లో ఆయనను కలవడం మా ఇద్దరికి చాలా ప్రత్యేకం. నా జర్నీ గురించి తెలుసుకొని, నాకు సపోర్ట్ ఇస్తానని అన్నయ్య భరోసాను ఇచ్చారు అని వెల్లడించారు.

కాగా చిరంజీవి హిట్ పాటల్లో ఒకటైన ఇంధువదన కుందురదనా పాటకు సుధాకర్, హారిక ఆ మధ్యన స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే. ఆ పాట డ్యాన్స్ స్టెప్పులను వారిద్దరు రీక్రియేట్ చేశారు. అదంతా ఐఫోన్‌లోనే చిత్రీకరించి, చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా గతేడాది ఆగష్టులో విడుదల చేశారు. అది వైరల్‌గా మారిపోవడంతో.. చిరు దగ్గరకు కూడా చేరింది. అప్పుడు చిరంజీవి ఆ వీడియోపై ప్రశంసలు కురిపిస్తూ ఓ ఆడియోను విడుదల చేశారు. ఇక తాజాగా ఆ ఇద్దరిని తన వద్దకు పిలుచుకొని వారికి అభినందనలు తెలిపారు చిరంజీవి. అయితే మనసుతో, ఒక విచిత్రం మూవీల్లో చిన్న పాత్రల్లో నటించిన సుధాకర్.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత కుందనపు బొమ్మలోనూ అలరించారు. చివరగా హీరోగా నువ్వు తోపురాలో కనిపించారు సుధాకర్.