ఇకపై థియేటర్లకు 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి..

కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన పరిశ్రమల్లో సినిమా పరిశ్రమ ఒకటి. లాక్‌డౌన్‌ కారణంగా సినిమా చిత్రీకరణలు ఆగిపోవడం, థియేటర్లు మూతపడడంతో తీవ్ర నష్టం ఏర్పడింది. ఇక కేంద్రం ఇచ్చిన సడలింపుల మేర ఇప్పుడిప్పుడే చిత్ర నిర్మాణాలు జరుగుతున్నాయి. అదే సమయంలో థియేటర్లు కూడా తెరుచుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కానీ కేవలం 50 శాతం ఆక్యూపెన్సీతోనే నడిపించాలనే షరతు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఆరు నెలలకుపైగా థియేటర్లు మూతపడడంతో నష్టపోయిన థియేటర్ల యజమానులు ఈ నిబంధనతో మరింత నష్టపోయే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం థియేటర్లకు అనుమతిచ్చినప్పటికీ కొంత మంది యజమానులు థియేటర్లను తిరిగి ప్రారంభించలేదు. అయితే తాజాగా తమిళనాడు ప్రభుత్వం థియేటర్ల ఓనర్లకు శుభవార్త చెప్పింది. ఇకపై పూర్తి 100శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను నడుపుకోవచ్చని తమిళనాడు ప్రభుత్వం కొత్త జీవోను అమలు చేసింది. ఇక పై తమిళనాడులోని అన్ని థియేటర్లు 100శాతం ఆక్యుపెన్సీతో కలకలలాడనున్నాయి. దీంతో మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అతి త్వరలో 100 ఆక్యుపెన్సీ వచ్చేందుకు ఆస్కారాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.