కమల్ పార్టీకి మద్దతుగా సినీనటి సుహాసిని ప్రచారం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ నటుడు కమలహాసన్‌ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసేందుకు సీనియర్ నటి సుహాసిని రంగంలోకి దిగుతున్నారు. కమల్ ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ అభ్యర్థుల తరపున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు తమ పార్టీ తరపున ప్రచారం చేయనున్న వారి జాబితాను మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ ఎన్నికల సంఘానికి సమర్పించింది.

అందులో నటి శ్రీప్రియ, సినీ గేయరచయిత స్నేహన్, నటి సుహాసిని, మణిరత్నం సహా 13 మంది ఉన్నారు. సుహాసిని మరెవరో కాదు.. కమల హాసన్ సోదరుడు చారుహాసన్ కుమార్తెనే. తన చిన్నాన్న కమల్ తరపున ప్రచారం చేయనుండడం తనకెంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా సుహాసిని పేర్కొన్నారు. పార్టీ ప్రచార ప్రతినిధిగా ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు కార్డు లభించిన వెంటనే ప్రచారానికి వెళ్తానని సుహాసిని తెలిపారు.