బాగ్దాద్ లో ఆత్మాహుతి దాడి.. 13 మంది మృతి..

ఇరాక్‌ రాజధాని అయిన బాగ్దాద్‌లో ఆత్మాహుతి దాడులు జరిగాయి. గురువారం జరిగిన ఈ ఆత్మాహుతి దాడుల్లో 13 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే వరుస ఆత్మాహుతి దాడులతో పలువురు ప్రాణాలు కోల్పోతుండగా, అనేక మంది తీవ్ర గాయాల పాలవుతున్నారు. సెంట్రల్‌ బాగ్దాద్‌లో రెండు ఆత్మాహుతి పేలుళ్లు కలకలం సృష్టించాయి. తాయరన్‌ స్క్వేర్‌లో రద్దీగా ఉన్న మార్కెట్‌ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ఈ బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో 13 మంది వరకు మృతి చెందగా, 30 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు ప్రాథమిక నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని సమాచారం. కాగా, బాగ్దాద్‌లో వరుసగా పేలుళ్ల ఘటనలు చోటు చేసుకోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.

అయితే ఈ దాడికి బాధ్యులుగా ఏ ఉగ్రవాది సంస్థ ప్రకటించలేదు. 2017లో ఇస్లామిక్‌ స్టేట్‌ పరాజయం తర్వాత నుంచి ఇక్కడ ఆత్మాహుతి దాడులు చాలా వరకు జరలేదు. అమెరికా మద్దతుతో ఇరాక్‌ మిలటరీ 2017లోనే తమ భూభాగం ఇస్తామిక్‌ మిలిటెంట్‌ గ్రూపును నియంత్రణలోకి తీసుకువచ్చింది. ఆ తర్వాత ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో 2018 జనవరిలో టాయరన్‌ మార్కెట్లో బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 27 మంది మరణించారు. ఆ తర్వాత ఆత్మాహుతి దాడి జరగడం ఇదే తొలిసారి.