మళ్లీ ఓడిన సన్‌రైజర్స్.. ప్లే ఆఫ్స్ రేసులోకి కోల్‌కతా

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఏదీ కలిసి రావడం లేదు. వరుస పరాజయాలతో ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన హైదరాబాద్‌.. ఆదివారం కోల్‌కతా చేతిలోనూ ఓటమి పాలైంది. బ్యాటింగ్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన రైజర్స్‌.. బౌలింగ్‌లోనూ నిరాశ పరిచింది. ఈ విజయంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్లే ఆఫ్స్‌కు చేరువకాగా..విలియమ్సన్‌ సేన పదో పరాజయాన్ని మూటగట్టుకుంది!

దుబాయ్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 14వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పరాజయాల పరంపర కొనసాగుతున్నది. బ్యాటర్ల బాధ్యతారాహిత్యానికి బౌలర్ల నిస్సహాయత తోడవడంతో రైజర్స్‌ లీగ్‌లో పదో ఓటమి మూటగట్టుకుంది. మరోవైపు కీలక దశలో సమిష్టిగా సత్తాచాటిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్లే ఆఫ్స్‌ దిశగా ముందడుగేసింది. ఆదివారం జరిగిన లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో కోల్‌కతా 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 115 పరుగులే చేసింది.

కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (26) టాప్‌ స్కోరర్‌ కాగా.. జాసన్‌ రాయ్‌ (10), వృద్ధిమాన్‌ సాహా (0), ప్రియం గార్గ్‌ (21), అబ్దుల్‌ సమద్‌ (25), అభిషేక్‌ శర్మ (6), జాసన్‌ హోల్డర్‌ (2) విఫలమయ్యారు. కోల్‌కతా బౌలర్లలో సౌథీ, వరుణ్‌ చక్రవర్తి, శివం మావి తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 119 పరుగులు చేసింది. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (57; 10 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. వెంకటేశ్‌ అయ్యర్‌ (8), రాహుల్‌ త్రిపాఠి (7) త్వరగానే ఔటవడంతో హైదరాబాద్‌ పుంజుకునే అవకాశం వచ్చినా.. ఆఖర్లో నితీశ్‌ రాణా (25), దినేశ్‌ కార్తీక్‌ (18) ధాటిగా ఆడి కోల్‌కతాను విజయతీరాలకు చేర్చారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో హోల్డర్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. శుభ్‌మన్‌ గిల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.