ప్రధాని ‘మన్‌ కీ బాత్’పై కోహ్లీ స్పందన

ఆస్ట్రేలియాపై చారిత్రక విజయాన్ని అందుకున్న టీమిండియాను ప్రధాని నరేంద్రమోదీ తన ‘మన్ కీ బాత్’లో ప్రశంసిచడంపై సారథి విరాట్ కోహ్లీ, టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. మోదీ నేటి ‘మన్ కీ బాత్’లో మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత జట్టు తొలుత ఎదురుదెబ్బలు తిన్నా తర్వాత పుంజుకుని సిరీస్‌ను కైవసం చేసుకుందని కొనియాడారు. భారత జట్టు హార్ట్‌వర్క్, టీం వర్క్ స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.

ప్రధాని ప్రశంసలపై స్పందించిన కోచ్ రవిశాస్త్రి ‘థ్యాంక్యూ సర్’ అని ట్వీట్ చేశాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు మరింతగా రాణించడానికి ప్రధాని మాటలు ప్రేరణగా నిలుస్తాయని అన్నాడు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా అప్పుడు సమస్యే కాదన్న రవిశాస్త్రి ‘జై హింద్’తో ట్వీట్‌ను ముగించాడు.

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కూడా మోదీకి కృతజ్ఞతలు తెలిపాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎప్పటికీ గౌరవమేనని పేర్కొన్నాడు. మరింతమందిలో స్ఫూర్తి రగిలిస్తూనే ఉంటామని కోహ్లీ ట్వీట్ చేశాడు. టీమిండియాపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీకి రహానే, మహ్మద్ షమీ కూడా కృతజ్ఞతలు తెలిపాడు.