మయన్మార్‌లో ఆందోళనలపై అణచివేత..

సైనిక తిరుగుబాటను వ్యతిరేకిస్తూ మయన్మార్‌లో కొనసాగుతున్న ఆందోళనపై పోలీసులు అణచివేత చర్యలకు పాల్పడ్డారు. ప్రదర్శనలు చేయడం చట్టవిరుద్ధమని నిబంధనలు విధించినా వాటిని ఉల్లంఘించి మరీ మంగళవారం ప్రజలు వీధుల్లోకి వచ్చి పెద్దయెత్తున ఆందోళనలు చేశారు. దేశంలో రెండవ అతిపెద్ద నగరమైన మందలేలో జరిగిన ప్రదర్శనపై పోలీసుల వాటర్‌ కెనాన్ల (జల ఫిరంగులు)ను ప్రయోగించారు. అక్కడ గుమిగూడిన ప్రజలను వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరిస్తూ పోలీసులు తొలుత రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాదాపు 25, 30 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. రాజధాని నెపిటాలో కూడా వరుసగా రెండో రోజూ జల ఫిరంగులను ఉపయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు.

సైన్యం తక్షణమే అధికారాలను సూకీ ప్రభుత్వానికి అప్పగించాలని నిరసన ప్రదర్శకులు డిమాండ్‌ చేస్తున్నారు. సూకీని, ఇతర పాలక పార్టీ సభ్యులను తక్షణమే విడుదల చేయాలని, పార్లమెంట్‌ కొత్త సమావేశాలను నిలిపివేయాలని కోరుతున్నారు. మయన్మార్‌లో రోజురోజుకూ నిరసనలు పెరుగుతున్నాయి. అయితే గతంలో ఇటువంటి ఉద్యమాలపై సైన్యం కర్కశంగా వ్యవహరించిన దాఖలాలు వున్నాయి.. ప్రధానంగా యాంగాన్‌, మందలేల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించడం, ఐదుగురి కన్నా ఎక్కువ మంది గుమిగూడడం, ర్యాలీలను నిషేధించడం వంటి చర్యలు తీసుకుంటూ సోమవారం రాత్రి డిక్రీ జారీ చేశారు. మంగళవారం నాటి ప్రదర్శనలు ఇతర నగరాల్లో కూడా జరిగాయి. అన్ని చోట్లా పోలీసులు ప్రదర్శకులపై చర్యలకు దిగారు.