సుప్రీం కోర్టులో కరోనా కలకలం.. 50 శాతం సిబ్బందికి కరోనా పాజిటివ్‌.

ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న వేళ సుప్రీంకోర్టులో 50 శాతం సిబ్బంది మహమ్మారి బారిన పడడం కలకలం రేపుతోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు కోర్టు రూముతోపాటు సుప్రీంకోర్టు ఆవరణ మొత్తాన్ని శానిటైజ్ చేస్తున్నారు.

కోర్టులోని సగం మంది సిబ్బంది వైరస్ బాధితులుగా మారడంతో ఇక నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కేసులను విచారించాలని న్యాయమూర్తులు నిర్ణయించారు. తాజా కలకలం నేపథ్యంలో కోర్టు బెంచ్‌లన్నీ నేడు ఓ గంట ఆలస్యంగా కేసుల విచారణను ప్రారంభించనున్నాయి. కాగా, శనివారం ఒక్క రోజే 44 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

‘‘నా సిబ్బందిలోని చాలామంది లా క్లర్కులు కరోనా బారినపడ్డారు’’ అని ఓ న్యాయమూర్తి తెలిపారు. గతంలో కొంతమంది న్యాయమూర్తులు కరోనా బారినపడినా ఆ తర్వాత కోలుకున్నారు. ఇండియాలో గత కొన్ని వారాలుగా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. గత వారం రోజుల్లో ఏకంగా పది లక్షల కేసులు వెలుగు చూశాయి. రోజువారీ కేసుల సంఖ్య వరుసగా ఆరో రోజు కూడా లక్ష మార్కును దాటింది. నేడు ఏకంగా 1,68,912 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన రోజువారీ కేసుల్లో ఇదే అత్యధికం. అలాగే, 904 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.