సుశాంత్ చివ‌రి సినిమా

సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ సినీ అభిమానులను శోక సంద్రంలో ముంచి నింగికేగి దాదాపు నెలన్నర కావొస్తుంది. ఈ టాలెంటెడ్‌ యాక్టర్‌ నటించిన చివరి చిత్రం ‘దిల్‌ బేచారా’. ఆఖరి సినిమాను వెండితెరపైనే చూడాలని అభిమానులు ఎంతగానో ఆశపడ్డారు. అయితే కరోనా మహమ్మారి కట్టడికై విధించిన లాక్‌డౌన్‌ కారణంగా‘దిల్‌ బేచారా’ను ఓటీటీ వేదికగా విడుదల చేయాల్సి వచ్చింది. సుశాంత్‌ బలవన్మరణాన్ని జీర్ణించుకోలేక సన్నిహితులు, అభిమానులు అతడి జ్ఞాపకాలతో రోజులు గడుపుతున్న భావోద్వేగ సమయంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీ ట్రైలర్స్‌లో అత్యధిక లైకులతో ఆల్‌టైమ్‌ రికార్డు సాధించిన ఈ సినిమా  ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.

ప్ర‌ముఖ న‌వలా ర‌చ‌యిత జాన్ గ్రీన్ పుస్త‌కం ది ఫాల్ట్ ఇన్ అవ‌ర్ స్టార్స్ ఆధారంగా విషాద‌ర‌క‌మైన థీమ్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో మైనీ పాత్ర‌లో సుశాంత్ క‌నిపిస్తాడు. అతను దివ్యాంగుడైన‌ప్ప‌టికీ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటూ కాలం వెళ్ల‌దీస్తుంటాడు. ఈ నేప‌ధ్యంలోనే మైనీకి థైరాయిడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బెంగాలీ అమ్మాయి కీజీ బసు ప‌రిచ‌య‌మ‌వుతుంది. ఆమె త‌నతో ఎప్పుడూ ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ క్యారీ చేస్తుంటుంది. అయితే మైనీ ప‌రిచ‌యంతో ఆమె జీవితం ఆనందమ‌యంగా మారుతుంది. మ‌ర‌ణంతో పోరాడుతున్న వీరిద్ద‌రూ మ‌రింత స‌న్నిహితం అవుతారు. కీజీ ప్ర‌తీ కోరికనూ తీర్చేందుకు మైనీ ప్ర‌య‌త్నిస్తాడు. త‌రువాత క‌థ ప‌లు మ‌లుపులు తిరుగుతుంది. సీరియ‌స్‌గా సాగిపోయే ఈ సినిమాలో వినోదం త‌క్కువ‌గానే ఉంటుంది. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం ఎంత‌గానో ఆకట్టుకుంటుంది. సుశాంత్ చివరి చిత్రం దిల్ బెచారా అభిమానుల‌కు ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది.