మోడెర్నా వ్యాక్సిన్‌తోనూ అలర్జీ లక్షణాలు

ఇప్పటికే అమెరికా కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఫైజర్‌, మోడెర్నా టీకాల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. అయితే మోడెర్నా టీకా వేయించుకున్న ఒక వైద్యునికి తీవ్ర అలర్జీ లక్షణాలు కనిపించినట్లు అమెరికన్‌ మీడియా వెల్లడించింది. బోస్టన్‌ మెడికల్‌ సెంటర్‌కు చెందిన జెరియాట్రిక్‌ అంకాలజీ వైద్యుడు హొస్సీన్‌ సదర్హాదేహ్ మోడెర్నా టీకాను వేయించుకున్నారు. వెంటనే తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వైద్యుడు తెలిపారు. కళ్లు తిరిగనట్లనిపించడంతో పాటు గుండె వేగంగా కొట్టుకుందని అన్నారు. మోడెర్నా టీకా పంపిణీ ప్రారంభమైన అనంతరం వెలుగులోకి వచ్చిన మొదటి కేసు ఇది. అయితే ఆ వైద్యుని వెంటనే చికిత్స అందించామని, ఎమర్జెన్సీ విభాగానికి తరలించి అనారోగ్యానికి గల కారణాలను విశ్లేషించామని అక్కడి వైద్యులు తెలిపారు. ఆ వైద్యునికి అంతకు ముందే షెల్‌ఫిష్‌ అలర్జీ ఉందని తెలిపింది. కాగా, ఫైజర్‌ వ్యాక్సిన్‌తో కూడా పలు అలర్జీ కేసులు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. వాటికి గల కారణాలపై అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డిఎ విచారణ జరుపుతోంది.