నవంబర్‌లో బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన

టీమిండియా వచ్చే ఏడాది నవంబర్‌లో బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నది. బంగ్లాదేశ్‌తో 2 టెస్టులు, 3 వన్డేలు ఆడనున్నది. స్పోర్ట్స్ వెబ్‌సైట్ క్రికిన్‌ఫో ఈ విషయాలను వెల్లడించింది. 2015 లో భారత్ బంగ్లాదేశ్‌లో పర్యటించింది. వచ్చే ఏడాది మొత్తం భారత జట్టు బిజీబిజీగా గడపనున్నది.

గత సంవత్సరం లాక్‌డౌన్ కారణంగా టీమిండియా బిజీ షెడ్యూల్ వాయిదా పడింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అనుకూలిస్తుండటంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని క్రికిన్‌ఫో వెబ్‌సైట్ తెలిపింది. వాయిదా వేసిన కార్యక్రమాలు రాబోయే రెండేండ్లలో జరుగుతాయి. వచ్చే ఏడాది ఆరంభం నుంచి భారత జట్టుకు బిజీ షెడ్యూల్ ఉన్నది. వెస్టిండీస్ జట్టు జనవరిలో భారతదేశంలో పర్యటించి పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఇందులో 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ప్రతిపాదించారు.

ఆ తర్వాత శ్రీలంక బృందం ఫిబ్రవరి, మార్చిలో భారత పర్యటనకు రానున్నది. శ్రీలంకతో 3 టెస్ట్ మ్యాచ్‌లు, 3 వన్డేల సిరీస్ ఆడనున్నది. అదే సమయంలో, పరిమిత ఓవర్ల సిరీస్ ఆడటానికి భారత జట్టు జూన్, జూలైలో ఇంగ్లండ్ వెళ్తుంది. ఇంగ్లండ్‌తో 3 వన్డేలు, 3 టీ 20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడిన తర్వాత.. అక్కడి నుంచి వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. జూలై-ఆగస్టులో వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20 లు ఆడేలా ప్రతిపాదనలు ఉన్నాయి. ఆసియా కప్ సెప్టెంబర్‌లో జరగనున్నది. భారత జట్టు సెప్టెంబర్-నవంబర్‌లో ఆస్ట్రేలియాతో స్వదేశీ సిరీస్ ఆడనున్నది. ఇందులో 4 టెస్టులు, 3 వన్డేల సిరీస్ ఆడవలసి ఉంది. నవంబర్‌లో బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది.

బంగ్లాదేశ్ బెనెటెక్‌కు టీవీ హక్కులు

బంగ్లాదేశ్ 2021 నుంచి 2023 వరకు టీవీ హక్కుల మార్కెటింగ్ ఏజెన్సీ బెనెటెక్‌కు 161.5 కోట్ల బంగ్లాదేశ్ కరెన్సీని విక్రయించింది. ఈ ఒప్పందంలో మొదటి సిరీస్ వచ్చే వారం బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య వన్డే సిరీస్ జరుగనున్నది. ఈ కొత్త ఒప్పందం మొత్తం 10 దేశీయ సిరీస్‌లను కలిగి ఉన్నది. వీటిలో ఈ సంవత్సరం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనతోపాటు వచ్చే ఏడాది భారత పర్యటన కూడా ఉన్నాయి.