పునీత్ రాజ్‌కుమార్‌కు కన్నీటి వీడ్కోలు.. తల్లిదండ్రుల సమాధుల పక్కనే అంత్యక్రియలు

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ అంతిమ సంస్కారాలు ముగిశాయి. ఆయన భౌతిక కాయానికి కంఠీరవ స్టూడియోలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అప్పు తల్లిదండ్రులు డా. రాజ్‌కుమార్‌, పార్వతమ్మను ఖననం చేసిన ప్రాంతంలోనే ఆయన భౌతికకాయానికి చివరి సంస్కారాలు నిర్వహించారు. కడసారి చూపు కోసం స్టేడియానికి అభిమానులు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో కూడా వేలాది మంది ప్రజలు, అభిమానులు, సినీనటులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

కార్డియాక్‌ అరెస్టుతోనే పునీత్‌ మరణం                                  

బెంగళూరు : పునీత్‌ రాజ్‌కుమార్‌ ‘కార్డియాక్‌ అరెస్ట్‌’తోనే మరణించినట్లు వైద్యులు గుర్తించారు. శుక్రవారం ఉదయం 9 గంటల వరకు వ్యాయామం చేసి అల్పాహారం తీసుకున్నాక ఆయన అస్వస్థతకు గురయ్యారు. తమ కుటుంబ వైద్యుడు డాక్టర్‌ రమణారావు నిర్వహించే రమణశ్రీ క్లినిక్‌కు భార్య అశ్వినితో కలిసి వెళ్లారు. ‘ జిమ్‌లో నుంచి రావడంతోనే చెమటలు పట్టాయి. అన్ని రకాల వ్యాయామాలు చేశా. బాక్సింగ్‌ చేశా. ఏదో ఇబ్బందిగా అనిపిస్తోంది..’ అని పునీత్‌ తనతో చెప్పారని రమణారావు తెలిపారు. ‘ సుమారు 11.10 గంటలకి ఈసీజీ తీస్తే హఅదయస్పందన అసహజంగా కనిపించింది. తక్షణమే ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించా. కారు వరకు నడిచి ఇబ్బంది పడకూడదని చక్రాల కుర్చీలో తీసుకెళ్లి కూర్చోబెట్టాం. అదే సమయంలో విక్రం ఆసుపత్రికి అశ్విని ఫోన్‌ చేసి పరిస్థితిని వైద్యులకు వివరించారు ‘ అని డా.రమణారావు పేర్కొన్నారు. 11.45 కు తమ ఆసుపత్రిలో పునీత్‌ను చేర్చారని.. అప్పటికే తీవ్రంగా గుండెపోటు రావడంతో వెంటిలేటర్‌ను అమర్చామని, కొద్దిసేపటికే ఆయన తుదిశ్వాస విడిచారని విక్రం ఆసుపత్రి వైద్యులు తెలిపారు.