జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

• జనసేన నాయకులు, శ్రేణుల సేవా కార్యక్రమాలు అభినందనీయం
నా పుట్టిన రోజును పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియచేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజా జీవితంలో ఉన్న వివిధ పార్టీల నాయకులు, కేంద్ర మంత్రులు, సామాజిక సేవకులు, విద్యావేత్తలు, వివిధ రంగాల నిపుణులు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా చలన చిత్రసీమ నుంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, రచయితలు, నిర్మాతలు అందించిన గ్రీటింగ్స్ మరచిపోలేనివి. వీరందరికీ నా కృతజ్ఞతలు. జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, అభిమానులు.. జన్మదిన వేడుకలను సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. వారు చేపట్టిన ప్రతి సేవా కార్యక్రమం అభినందనీయమైనది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 405 మంది రక్త దానం చేశారు. రక్త దాతలకు నా అభినందనలు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు తమ పంటలను కానుకగా పంపించారు. అలాగే ఏటికొప్పాక కళాకారులు కొయ్య బొమ్మలు, పొందూరు చేనేత కళాకారులు నేత వస్త్రాలు బహుమతిగా పంపించారు. రైతులకు, చేతి వృత్తి కళాకారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.