ముఖ్యమంత్రిపై జరిగిన దాడిపై విచారణ జరపాలి

మంగళగిరి: ఏపి ఈసిని కలిసిన జనసేన పీఏసీ మెంబర్ కోన తాతారావు, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ తదితరులు ముఖ్యమంత్రిపై విజయవాడలో జరిగిన దాడి పై వాస్తవాలు తేల్చాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో గులక రాయి పడింది. అది వాస్తవమో..? వాళ్ళే చేయించారో..? అనేదానిపై జనం అయోమయంలో ఉన్నారు. దానిని నిగ్గు తేల్చాలని కోరాం. డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ అక్కడే ఉన్నారు..ఏమి చేస్తున్నారు?
ముఖ్యమంత్రిపై రాయి వేస్తే ఇంతవరకు ఎందుకు తేల్చలేదు. స్వచ్ఛ, పారదర్శకంగా ఎన్నికలు జరగాలంటే, ఒక స్వతంత్ర కమిటీ వేసి విచారణ జరపాలి. కమిటీ రిపోర్ట్ ఎన్నికల కమిషన్ కి ఇవ్వాలి.. ఎన్నికల కమిషన్ పై మాకు పూర్తి నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి బస్సు యాత్రలో ఎందుకు కరెంట్ తీశారు? డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ, పవర్ డిస్ట్రిబ్యూషన్ ఎండి పై విచారణ జరపాలి.. వాళ్ళను విచారణ చేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి.
కోడి కత్తి మాదిరిగా చేసి, సింపథితో ఓట్లు సంపాదించాలని చూస్తున్నారా? దీనిపై పూర్తి విచారణ జరగాలి? రాయి విసిరిన వ్యక్తి ఎంత ఎక్స్పర్ట్ అయితే ఒక రాయి.. ఒకరికి తగిలిన తర్వాత మరొకరికి తగులుతుంది?. దాడిపై పోలీసులు మాటలు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళ ప్రభుత్వంలోనే కరెంట్ తీయించుకుని, రాయి వేయించుకొని డ్రామా ఆడుతున్నారు. క్వార్టర్ బాటిల్ ఇవ్వలేదని రాయి వేశారు అని సీపి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ పై చర్యలు తీసుకొని ఎన్నికల విధులు నుండి బహిష్కరించాలి. రాయి డ్రామా ఎన్నికల స్టంట్ మాత్రమే.
ఒక్క రాయి ఇద్దరు తగిలిందంటా.. కానీ రాయి మాత్రం కనపడటంలేదంటా..? స్వయాన ముఖ్యమంత్రిపై దాడి జరిగితే ఇంటెలిజెన్స్ వైపల్యంగా కాదా..? ఇంటెలిజెన్స్ ఏవిధంగా పనిచేస్తుందో అర్థం అవుతుంది. మరో సామాన్యుడినీ బలి చేసేందుకు సిద్దం అయ్యారు. ఐదు సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారు. అధికారుల వైఫల్యంపై పూర్తి దర్యాప్తు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అని అన్నారు.