మరో మూడు రోజుల పాటూ కొనసాగనున్నచలి తీవ్రత

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయి.. చలి వణికిస్తున్నది. తూర్పు, ఈశాన్య గాలుల ప్రభావం తీవ్రంగా ఉన్నది. దీనికి ఉత్తరాది గాలులు తోడు కావడంతో సగటు ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరిగింది. గురు, శుక్రవారం వరకు చలి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తరువాత గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగొచ్చని పేర్కొన్నది. మంగళవారం రాష్ట్రంలో అత్యల్పంగా ఆదిలాబాద్‌ జిల్లా అర్లి(టీ)లో ఆరు డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని తెలంగాణ రాష్ర్ట అభివృద్ధి ప్రణాళిక సొసైటీ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 6 నుంచి 8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 36.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరోవైపు, హైదరాబాద్‌లో చలి తీవ్రత కొనసాగుతున్నది. జనవరి చివరివారంలో ఉక్కపోత నెలకొనగా, వారం రోజులుగా చలి తీవ్రత పెరుగుతూ వచ్చింది.