ముస్లింల అభివృద్ది, సంక్షేమం కూట‌మితోనే

  • స‌మ‌స్త మాన‌వాళికి మాన‌వ‌సేవ చేయాల‌న్న‌ సందేశం అందించే రంజాన్‌
  • జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజి

చిల‌క‌లూరిపేట‌: మానవ సేవ చేయాలన్న సందేశాన్ని మానవాళికి అందించే పండుగ రంజాన్ అని జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజి అన్నారు. మండ‌లంలోని వేలూరు గ్రామంలో ముస్లిం సోద‌రులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ వేడుక‌ల్లో ఆయ‌న పాల్గొన్నారు. ప్ర‌త్యేక ప్రార్ధ‌న‌ల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా బాలాజి మాట్లాడుతూ రంజాన్‌ మాసంలో ఆచరించే ప్రార్థనలు ఉపవాస దీక్షలు ఆధ్మాకత, క్రమశిక్షణను పెంపొందిస్తాయన్నారు. ఇవి ప్రజలందరినీ ఏకం చేసి ఔన్నత్యం చాటుతున్నాయ‌న్నారు. రంజాన్ పండుగ‌ను ముస్లింలందరూ ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఆకాంక్షించారు. కూట‌మితోనే ముస్లింల‌కు మేలు. రానున్న రోజుల్లో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి అధికారంలోకి రానున్న‌దని, కూట‌మి పాల‌న‌లోనే ముస్లిం సంక్షేమం, అభివృద్ది సాధ్య‌మౌతుంద‌ని బాలాజి వివ‌రించారు. ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో ముస్లింలు అన్ని విధాలుగా ఇబ్బందులు ప‌డ్డార‌ని, అనేక దాడులు వారిపై జ‌రిగినా స్పంద‌న క‌రువైంద‌న్నారు. ఈ ప్ర‌భుత్వంలో ఒక్క మ‌సీదు మ‌ర‌మ‌త్తు కోసం డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని, ఆరు నెల‌లుగా ఇమామ్‌, మౌజన్‌లకు గౌరవ వేతనం ఇవ్వ‌డం లేద‌న్నారు. రాష్ట్రంలో ప‌లు ప్రాంతాల్లో ముస్లింల‌పై దాడులు పెరిగి పోయాయ‌ని, ముస్లిం ఆడ‌బిడ్డ‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువైంద‌న్నారు. ముస్లింలపై జగన్‌కు నిజంగా ప్రేమ ఉంటే రంజాన్ మాసంలో ఇచ్చే తోఫాను ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఉన్న దుల్హన్‌ పథకం, దుకాన్ మకాన్‌ సహా పది సంక్షేమ పథకాలను రద్దు చేసిన జగన్. ఎన్నికలు రాగానే మత రాజకీయంతో లబ్ధి పొందాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. మరోసారి ఈ వైసీపీ ప్రభుత్వం వస్తే బానిస బతుకులే ఉంటాయని అందరూ గుర్తుంచుకోవాలన్నారు.