2021 హజ్ యాత్రపై తుది నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం 2021 హజ్ యాత్రపై క్లారిటీ ఇచ్చింది. హజ్ యాత్ర  జాతీయ, అంతర్జాతీయ కోవిడ్-19 మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టంచేసింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ వచ్చే ఏడాది జరిగే హజ్ యాత్రపై సోమవారం మాట్లాడారు. భారత్‌తోపాటు సౌదీ అరేబియా  నుంచి కోవిడ్  తుది మార్గదర్శకాలు వెలువడిన తర్వాతే 2021 హజ్ యాత్రపై నిర్ణయం తీసుకోనున్నట్లు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పష్టంచేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో  కేంద్ర ప్రభుత్వం యాత్రికుల సంక్షేమానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. చరిత్రలో.. హజ్ యాత్ర  ప్రక్రియలో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని నఖ్వీ అభిప్రాయపడ్డారు.

సోమవారం జరిగిన హజ్ యాత్ర 2021 సమీక్ష సమావేశానికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అధ్యక్షత వహించి మాట్లాడారు. 2021 హజ్ యాత్రను జూన్-జూలై నెలల్లో నిర్వహించేందుకు నిర్ణయించామని ఆయన తెలిపారు. అయితే భారత్, సౌదీ అరేబియా ప్రభుత్వం జారీ చేసే కోవిడ్ 19 తుది మార్గదర్శకాల అనంతరం.. ప్రయాణికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని దీనికి సంబంధించి తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని నఖ్వీ తెలిపారు. ఈ నిర్ణయం అనంతరం హజ్ కమిటీ, ఇతర భారతీయ ఏజెన్సీలు హజ్ 2021 దరఖాస్తు ప్రక్రియ, తదితర అంశాలను అధికారికంగా ప్రకటిస్తాయని నఖ్వీ స్పష్టంచేశారు.

ఈ ఏడాది హజ్‌ యాత్రను విరమించుకున్న సుమారు 1.23 లక్షల మందికి వారు చెల్లించిన సొమ్ము రూ.2,100 కోట్లను.. ఎలాంటి కోతలూ విధించకుండా తిరిగి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు నఖ్వీ తెలిపారు.