వైట్ హౌస్ కి చేరుకున్న ట్రంప్‌

కరోనా మహమ్మారితో మిలటరీ హాస్పిటల్‌లో చేరిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ డిశ్ఛార్జి అయ్యారు. నాలుగు రోజుల పాటు ఆయన హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు. ఆస్పత్రి నుంచి నేరుగా వైట్ హౌస్ కి చేరుకున్నారు. మరో వారంపాటు వైద్యులు అక్కడే చికిత్స అందించనున్నారు. మహమ్మారి నుంచి కోలుకొని డిశ్ఛార్జి అవుతున్నందుకు సంతోషంగా ఉందని ట్రంప్‌ అన్నారు. కొవిడ్‌ గురించి ఎవరూ భయపడొద్దని సూచించారు. మన జీవితాలపై వైరస్‌ ఆధిపత్యం ప్రదర్శించకుండా చూసుకోవాలని హితవు పలికారు. కరోనా నియంత్రణకు అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

ఆస్పత్రి నుంచి వైట్ హౌస్ కి చేరుకున్న ట్రంప్‌ ఆరోగ్యంగా కనిపించారు. ఎప్పటిలా ఎలివేటర్‌లో కాకుండా సౌత్‌ పోర్టికో మెట్ల ద్వారా పైకి చేరుకున్నారు. విలేకరులకు అభివాదం చేశారు. అప్పటి వరకు మాస్క్‌ ధరించిన ఆయన దాన్ని తొలగించి పోర్టికోలో నిలబడి ఆయన వచ్చిన హెలికాప్టర్‌ ‘మెరైన్‌ వన్‌’కు సైనిక వందనం చేశారు. అనంతరం ట్విటర్‌ వేదికగా తన మద్దతుదారులకు సందేశం ఇచ్చారు. కొవిడ్‌కు ఎవరూ భయపడొద్దని సూచించారు. తన పాలనలో అద్భుతమైన ఔషధాలు అభివృద్ధి అయ్యాయన్నారు. అందరం కలిసి ఈ మహమ్మారిని ఓడించాలని పిలుపునిచ్చారు. తన మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తనకోసం ఆస్పత్రి వద్దకు వచ్చిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలపాలనిపించిందంటూ ఆదివారం కాసేపు బయటకు వచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. త్వరలోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ధీమా వ్యక్తం చేశారు.