తొలిరోజు ప్రశాంతంగా ముగిసిన జేఈఈ మెయిన్‌

దేశవ్యాప్తంగా మంగళవారం ప్రారంభమైన జేఈఈ మెయిన్‌ తొలిరోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. బీఆర్క్‌లో ప్రవేశ పరీక్ష కావడంతో హాజరు తక్కువగా ఉంది. బుధవారం నుంచి జరిగే బీటెక్‌ ప్రవేశ పరీక్షలకు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశాలున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. వరదలతో పరీక్షకు హాజరు కాలేని విదర్భ విద్యార్థులు ఎన్టీఏను సంప్రదించాలంటూ నాగ్‌పూర్‌లోని బాంబే హైకోర్టు బెంచ్‌ సూచించింది. 15 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఎన్టీఏను ఆదేశించింది. పశ్చిమ బెంగాల్‌ లో 24 పరగణాలు, బెర్హంపూర్‌, మాల్దా, సిలిగురి ప్రాంతాల్లో విద్యార్థులు భారీ వర్షంలోనే బస్సుల కోసం గంటల పాటు వేచిచూడాల్సి వచ్చింది. మహారాష్ట్రలోలాగే బిహార్‌లోనూ బుధవారం నుంచి 20 ప్రత్యేక సబర్బన్‌ రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు.