తొలి టీకా తీసుకొన్న ఇజ్రాయెల్‌ ప్రధాని

ఇజ్రాయెల్‌ లోవ్యాక్సినేషన్‌ కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది. ముందుగా ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు శనివారం కరోనా టీకా తీసుకోవడంతో ఆ దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది. వ్యాక్సిన్‌ తీసుకున్న తొలి ఇజ్రాయెల్‌ వాసి నెతన్యాహుయే కావడం విశేషం. టీకాపై కొన్ని వర్గాల్లో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో వాటిని పటాపంచలు చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలి పిలుపునిచ్చారు. ఒక వ్యక్తి చేయించుకొనే చిన్న ఇంజెక్షన్‌ ఎంతో మంది ఆరోగ్యాన్ని రక్షించే పెద్ద ముందడుగు అని వ్యాఖ్యానించారు.

ఇజ్రాయెల్‌లో ఇప్పటి వరకు 3.72 లక్షల కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 3,070 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌కు ఇప్పటి వరకు ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ రూపొందించిన నాలుగు మిలియన్ల కరోనా టీకా డోసులు అందాయి. వీటితో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమెరికా, బ్రిటన్‌, రష్యాలో ఇప్పటికే వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే.