శ్రీశైలం ప్రమాద విచారణకు మరో కమిటీ నియమించిన ప్రభుత్వం

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం మరో కమిటీని నియమించింది. ఇప్పటికే నేర దర్యాప్తు సంస్థ (సీఐడీ) అదనపు డీజీ గోవింద్‌సింగ్‌ నేతృత్వంలోని ఓ బృందం విచారణ ప్రారంభించగా, తాజాగా మరో కమిటీని నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి అధ్యక్షతన నలుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సీఎండీ ఆదేశాలు జారీ చేసింది. శ్రీశైలం అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో నిర్దేశించింది. ఈ కమిటీలో శ్రీనివాసరావు(జేఎండీ), జగత్‌ రెడ్డి(ట్రాన్స్‌మిషన్‌ డైరెక్టర్‌), సచ్చిదానందం (టీఎస్‌ జెన్‌కో ప్రాజెక్టు డైరెక్టర్‌), రత్నాకర్‌ (కన్వీనర్‌) సభ్యులుగా ఉన్నారు.