ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

మైలవరం, స్థానిక జనసేనపార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జనసేనపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి అక్కల రామ్మోహన్ రావు(గాంధీ) మాట్లాడుతూ ఇటీవల అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేయాలని, తడిసిన మరియు రంగు మారిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చివరి గింజ వరకు కొంటామని చెప్తుంటే, అధికార యంత్రాంగం మాత్రం సూచనలు చేస్తాం కానీ, ధాన్యాన్ని కొనలేమని స్పష్టం చేయడాన్ని చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి పాలన ఈ రాష్ట్రంలో ఎలా ఉందో స్పష్టంగా కనబడుతూ ఉందని విమర్శించారు. స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కు వ్యాపారం చేయడమే తెలుసు గాని, కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించాలి, వారిని ఆదుకోవాలని, ఆదుకోవాలనే ఆలోచన లేదని, మైలవరం నియోజకవర్గంలో ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా, బూడిద మాఫియాను మాత్రం ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని, ఇది దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. సార్వా పంట తాలూకా డబ్బులు ఇంకా పూర్తిగా రైతులకు చెల్లించలేదని, మరి దాల్వా డబ్బులు ఇవ్వడానికి ఇంకెంతకాలం పడుతుందో? అని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వ పాలనలో రైతుల నడ్డి విరుస్తున్నారని, మరో పంట కాలం పూర్తయిన తర్వాత కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కావడం లేదని, ఇదేనా రైతు ప్రభుత్వం అని నిలదీశారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, ఉపాధ్యక్షులు పడిగల ఉదయ్, జనసేన నాయకులు ఈతకొట్టు నాని, మాదాసు సుబ్బారావు, చిట్టిమాధ వెంకటకృష్ణ, కస్తాల రవి, తమ్ముండ్రు నవీన్, రవితేజ, శీలం చందు, ఎడ్ల సుధాకర్, బాలు తదితరులు పాల్గొన్నారు.