అంతరిక్షంలో ప్రయాణించనున్న అమెజాన్ అధినేత

వాషింగ్టన్‌: అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ అంతరిక్ష ప్రయాణానికి సిద్ధమయ్యారు. వచ్చే నెల 20న తన సోదరుడితో కలిసి వ్యోమనౌకలో అంతరిక్షంలో ప్రయాణం చేయనున్నట్లు తెలిపారు. జెఫ్‌ బెజోస్‌ స్థాపించిన బ్లూ ఆరిజిన్‌ సంస్థ అంతరిక్షంలోకి సందర్శకులను తీసుకవెళుతోంది. సాధారణ పౌరుల అంతరిక్ష యాత్రలో భాగంగా సందర్శకులను మోసుకెళ్తున్న మొదటి వ్యోమనౌక కూడా ఇదే కావడం గమనార్హం. అంతరిక్ష సందర్శనలో భాగంగా ఈ రాకెట్‌ ఆరుగురు వ్యక్తులకు తీసుకువెళ్లనుంది. ఈ పర్యటన మొత్తం దాదాపు పది నిమిషాలు కొనసాగనున్నట్లు సమాచారం. ముఖ్యంగా అంతరిక్షానికి, భూ వాతావరణానికి మధ్య ‘కర్మన్‌ లైన్‌’గా వ్యవహరించే ప్రాంతంలో నాలుగు నిమిషాల పాటు యాత్రికులు గడిపిన అనంతరం తిరిగి భూమిని చేరుకుంటారు. అంతరిక్ష పర్యటన కోసం బ్లూ ఆరిజిన్‌ రూపొందించిన న్యూషెపర్డ్‌ రాకెట్‌పై 2012 నుంచి పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. భూమి నుంచి 100కి.మీ కంటే ఎత్తులో ఉన్న సబ్‌ ఆర్బిటాల్‌లోకి వ్యోమగాములు, పేలోడ్‌లను తీసుకెళ్లేలా రూపొందించిన ఈ రాకెట్‌ ప్రయోగాలు ఇప్పటికే విజయవంతమయ్యాయి. ఒకవేళ మార్గమధ్యంలో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైనప్పడు రాకెట్‌లో ఉన్న సిబ్బంది సురక్షితంగా బయటపడేసే వ్యవస్థ కూడా ఉందని బ్లూ ఆరిజిన్‌ తెలిపింది. కాగా, అంతరిక్ష విమానం ద్వారా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించేందుకు పలు సంస్థలు యత్నిస్తున్నాయి. వర్జిన్‌ గెలాక్టిక్‌, టెస్లాలు కూడా ఇప్పటికే పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయి.