సిద్దిపేట కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు

కోర్టు ధిక్కార కేసులో సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధితుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితులకు ఇచ్చిన చెక్కులు నగదుగా మారకుండా ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డిని నిలదీసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధితులకు పరిహారం చెల్లింపులకు సంబంధించి జూలై 10న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. కాగా, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేశామని ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. సుప్రీంకోర్టు నుంచి తగిన ఆదేశాలు పొందాలని, లేని పక్షంలో కౌంటర్‌ వేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. కాళేశ్వరం భూసేకరణలో నష్టపోయిన రైతులు, రైతు కూలీలకు మూడు నెలల్లో పరిహారం ఇవ్వాలని, ఇప్పటికే చెల్లించిన మొత్తాలను మినహాయించుకుని మిగిలిన డబ్బును చెల్లించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలు అమలు చేయకపోవడాన్ని సవాల్‌ చేస్తూ… సిద్దిపేట జిల్లా కొచ్చగుట్లపల్లి గ్రామానికి చెందిన టి. మమత, జి. ప్రభాకర్‌లు వేర్వేరుగా కోర్టు ధిక్కార వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చాయి. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసినట్లు ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే వరకు ఈ వ్యాజ్యాల విచారణను వాయిదా వేయాలని కోరారు. ఏజీ వాదనలపై స్పందించిన ధర్మాసనం… సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు రానప్పుడు బాధితులకు ఇచ్చిన పరిహారం చెక్కులు మారకుండా కలెక్టర్‌ ఎందుకు నిలుపుదల చేశారని నిలదీసింది. ఈ చర్య కోర్టు ధిక్కారమే అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది.