సాటి మనిషికి సాయం చేయాలనే ఉద్దేశంతోనే పార్టీ ప్రారంభించా: పవన్‌ కల్యాణ్‌

నివర్‌ తుపాను బాధితులను పరామర్శించేందుకు జనసేన అధినేత చేపట్టిన పర్యటన నెల్లూరు జిల్లాల్లో కొనసాగుతోంది. ఈ  పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నెల్లూరు జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే వారితో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నెల్లూరు తమ అమ్మవారి ఊరని, ఇక్కడే పుట్టి పెరిగానని పేర్కొన్నారు. అందుకే నెల్లూరు అంటే ఎనలేని అభిమానమన్నారు. మొక్కలంటే విపరీతమైన ప్రేమ అని నెల్లూరులోని ఇంట్లో చెట్లు లేకపోవడం వల్లనే ఇక్కడ ఉండలేకపోయానని పేర్కొన్నారు. పదో తరగతి గ్రేస్‌ మార్కులతో పాయయ్యానని, చదువు మధ్యలోనే అపేసినా చదవడం మాత్రం ఆపలేదన్నారు. చిన్నప్పుడు గొప్ప ఆశయాలేం ఉండేవి కాదని, ఎస్సై ఉద్యోగంలో చేరి ప్రజలను రక్షించాలని అనుకునేవాడినని అన్నారు. కానీ ఇంటితోపాటు చుట్టాల ఇళ్లల్లోనూ రాజకీయ వాతావరణం ఉండటంతో రాజకీయ స్పృహ పెరిగిందన్నారు.

సాటి మనిషికి ఏదైనా సాయం చేయాలనే ఉద్దేశంతోనే పార్టీ ప్రారంభించానని పవన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందుకే ప్రజారాజ్యం పార్టీ ఏర్పడినప్పుడు కూడా కీలకంగా పనిచేశానని అన్నారు. జనసేన పార్టీని ప్రారంభించాక పార్టీని నడపలేమని కొందరు నా ఆశయాన్ని నీరుగార్చేందుకు చూసినా భయపడలేదన్నారు. ప్రజాప్రతినిధులు చేసే పనులకు సామాన్యులు బలవ్వకూడదనే ఉద్దేశంతోనే ప్రజలకు సేవచేయాలనుకున్నానని తెలిపారు. విజయం సాధించినా, ఓటమిపాలైనా తన పోరాటం మాత్రం ఆగదన్నారు. అంబేడ్కర్‌ కలలుగన్న సమాజం రావాలని పవన్‌ ఈసందర్భంగా పేర్కొన్నారు. భావితరాల భవిష్యత్తు కోసమే జనసేన పనిచేస్తుందని వెల్లడించారు.