మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపాల్ ప్రధాని..

నేపాల్‌ ప్రధాని కేపీశర్మ ఓలీ మరోసారి శ్రీరాముడి జన్మస్థలంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం చిత్వన్‌లో జరిగిన నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (ఎన్‌సీపీ) సమావేశంలో ప్రసంగించారు. శ్రీరాముడి జన్మస్థలంలో ఆలయ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. అయోధ్యపురిలో రామ్‌ ఆలయ నిర్మాణం కోసం మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రాముడి విగ్రహం రూపుదిద్దుకుందని, సీతామాత విగ్రహం రూపుదిద్దుకుంటుందని, లక్ష్మణుడి, హనుమంతుడి విగ్రహాలను కూడా చేయించనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది శ్రీరామ నవమికి అయోధ్యాపురిలో విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

దీంతో ఈ ప్రాంతం అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా మారుతుందని, చాలా మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తారన్నారు. ఆలయం పూర్తయితే ప్రపంచంలోని హిందువులు, పురావస్తు శాస్త్రవేత్తలు, నాగరికత, సాంస్కృతిక నిపుణులకు చిత్వన్‌ గమ్యస్థానంగా నిలుస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో నేపాల్‌ ప్రధాని బీర్‌గంజ్ సమీపంలో నిజమైన అయోధ్య ఉందని ప్రకటించారు. శ్రీరాముడు పుట్టిన అసలైన అయోధ్య నేపాల్‌లో ఉన్నదని, శ్రీరాముడు భారతీయుడు కాదు నేపాలీస్ అంటూ ఓలీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై అటు నేపాల్‌తో పాటు ఇటు భారత్‌లో ఓలీ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.