మీరు దేశానికి గర్వకారణం.. నిరాశ చెందొద్దు: హాకీ టీమ్‌కు ధైర్యం నింపే ప్రయత్నం చేసిన ప్రధాని

టోక్యో: ఎన్నో ఏళ్ల శ్రమ తర్వాత ఒలింపిక్స్‌లో మెడల్‌కు దగ్గరగా వచ్చి అది దక్కకపోతే ఎంత బాధ ఉంటుందో ఇప్పుడు ఇండియన్ వుమెన్స్ హాకీ ( Hockey ) టీమ్‌ను చూస్తే తెలుస్తుంది. అసాధారణ పోరాటంతో బ్రాంజ్ మెడల్ మ్యాచ్ వరకూ వచ్చిన టీమిండియా.. 3-4 తేడాతో బ్రిటన్ చేతిలో ఓడి మెడల్ మిస్సయింది. అప్పటి నుంచి అమ్మాయిల టీమ్ తమ దుఃఖాన్ని ఆపుకోలేకపోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసిన సమయంలోనూ వాళ్లు భావోద్వేగానికి గురయ్యారు. మీరు దేశానికి గర్వకారణంగా నిలిచారు. నిరాశ చెందొద్దు. ఐదారేళ్లుగా ఎంతగానో చెమటోడ్చారు. మీ కష్టం వల్లే ఇండియా మళ్లీ ఇప్పుడు విశ్వవేదికపై సత్తా చాటింది అంటూ మోదీ వాళ్లలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.

ప్లేయర్ నవనీత కంటికి గాయమైంది కదా.. ఇప్పుడు ఆమె ఎలా ఉంది అని ఆరా తీశారు. ఆమె కంటికి నాలుగు కుట్లు పడ్డాయని కెప్టెన్ రాణి రాంపాల్ చెప్పగా.. కంటికైతే ప్రమాదం లేదు కదా అని మోదీ అడిగారు. వందన కూడా చాలా బాగా ఆడిందని ప్రశంసించారు. ఏమాత్రం నిరాశ వద్దని, మీరు దేశంలోని ఎంతో మందిలో స్ఫూర్తి నింపారని ఈ సందర్భంగా టీమ్‌ను మోదీ కొనియాడారు.