నేడు ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’కు శ్రీకారం చుట్టనున్న ప్రధాని

న్యూఢిల్లీ : ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’​ పేరిట నిర్వహిస్తున్న 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించనున్నారు. దండిమార్చ్‌ ప్రారంభమై 91 సంవత్సరాలైన నేపథ్యంలో గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమం వద్ద పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఆశ్రమం వద్ద ప్రారంభమైన పాదయాత్ర దండి వరకు సాగనుంది. 25 రోజుల పాటు 241 కిలోమీటర్ల పాటు సాగనుంది. 81 మందితో ప్రారంభమై ఏప్రిల్‌ 5న దండిలో ముగియనుంది. మార్గమధ్యంలో వివిధ వర్గాల ప్రజలు దండిమార్చ్‌లో భాగస్వామ్యం కానున్నారు. మార్చ్‌కు కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ నేతృత్వం వహించనున్నారు. మరో వైపు అమృత్‌ మహోత్సవాలు దేశవ్యాప్తంగా కొనసాగనున్నాయి.

భారతదేశానికి ఆంగ్లేయుల నుంచి స్వాతంత్యం లభించి 2022 ఆగస్టు 15తో 75 వసంతాలు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి (మార్చి 12) నుంచి 75 వారాల పాటు ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ వేడుకలు నిర్వహించాలని ప్రధాని నిర్ణయించిన విషయం తెలిసిందే. దండి మార్చ్‌, మహాత్మా గాంధీ, సుభాష్‌ చంద్రబోస్‌ తదితర ఉద్యమ నేతల త్యాగాలు ప్రతిభింబించేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు. శనివారం కార్యక్రమాలను వర్చువల్‌ విధానంలో కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావదేకర్‌ ప్రారంభించనున్నారు. అమృత్‌ మహోత్సవాలు నేటితో ప్రారంభమై వచ్చే ఏడాది ఆగస్ట్‌ 15 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సైతం వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నాయి.