సెప్టెంబర్‌లో మిగిలిన ఐపీఎల్ మ్యాచులు?

కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన ఐపీఎల్ మ్యాచులను సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచులు సెప్టెంబర్ 15 నుంచి అక్టో బర్ 15 వరకు మిగిలిన 31 మ్యాచులు ఆడించనున్నట్లు తెలుస్తున్నది. ఐపీఎల్ మిగిలిపోయిన మ్యాచులను యూఏఈ వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 29 మ్యాచ్‌ల తర్వాత కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడింది. 60 లలో 31 మ్యాచ్‌లు ఇంకా జరగలేదు.

ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లకు బీసీసీఐ చివరకు ఒక పరిష్కారం కనుగొన్నది. మిగిలిన మ్యాచ్‌లు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్య యూఏఈలో జరుగుతాయని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే, ఇదే సమయంలో ఈ మ్యాచ్‌ల నిర్వహణ కోసం ఇంగ్లండ్, యూఏఈలను బోర్డు పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది.

భారత్‌లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 2014 లీగ్‌లో మొదటి 20 మ్యాచ్‌లకు యూఏఈ ఆతిథ్యం ఇచ్చింది. కరోనా కారణంగా 2020 సీజన్ కూడా యూఏఈలోనే పూర్తయింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత టోర్నమెంట్ సీజన్‌ను యూఏఈలో పూర్తిచేయాలని బోర్డు భావిస్తున్నట్లుగా సమాచారం.

ఈ నెల 29 న ప్రకటించే అవకాశం..!

యూఏఈలో ఇప్పటికే ఐపీఎల్ మ్యాచులు జరిపినందున.. ప్రస్తుత టోర్నమెంట్ సీజన్‌ను ఇక్కడ పూర్తి చేయాలని నిర్ణయించినట్లు బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తున్నది. కొత్త ఐపీఎల్ వేదిక, తేదీలను ఈ నెల 29 న ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఆ రోజు బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరగనున్నది.