రెవెన్యూ శాఖ మొద్దు నిద్ర: ఎస్ వి బాబు

పెడన నియోజకవర్గం, పెడన మండలం, బల్లిపర్రు గ్రామంలోని పంట కాలువ గట్టును తవ్వి రోడ్డు వేస్తున్నప్పటికీ ఎమ్మార్వో గాని, రెవెన్యూ సిబ్బంది గాని పట్టించుకోకుండా నిమ్మకు నీరెట్టినట్లు వ్యవహరిస్తున్నారు. బల్లిపర్రు గ్రామ రైతులు మండల కార్యాలయానికి వెళ్ళి కాలువ గట్టు తవ్విన విషయం తెలియజేయగా అది మా పరిధిలో లేదని ఎమ్మార్వో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని రైతులు వాపోతున్నారు. ఈ కాలువ గట్టు తవ్వకం విషయంలో భారీగా నగదు చేతులు మారాయని అందువల్లనే అధికారులు దృష్టి సారించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణ డెల్టా కి నీరు అందించే కాలువలో ఒకటైన రామ్ రాజ్ ఛానల్ మెయిన్ కాలవ నుండి బల్లిపర్రు మరియు పాత బల్లిపర్రు గ్రామానికి సంబంధించిన సుమారు 700 ఎకరాలకు పైబడి నీరు అందించే పంట కాలువ ఒకవైపు గట్టును తవ్వి రోడ్డుగా మారుస్తున్నారు. బల్లిపర్రు తాగునీటి సరఫరా ఈ కాలువ ద్వారానే తీరుతుంది. 53 గొలుసుల వెడల్పు ఉండే పంట కాలువ ఆక్రమణకు గురవుతున్న రెవెన్యూ సిబ్బంది ఉదాసీనతగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. మంత్రి నుండి ఏమైనా ఆదేశాలు వచ్చాయా? లేక భూ ఆక్రమణ దారుల నుండి ఏవైనా ముడుపులు ముట్టాయా? అనేది బల్లిపర్రు రైతుల సందేహము. తమ పంట భూమి ఆక్రమణ పై సరైన చర్యలు తీసుకోని ఎడల సోమవారం గౌరవ కలెక్టర్ ని కలుస్తామని పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు తెలియజేశారు.