బాలల హక్కులు అనునిత్యం కాపాడాలి – పవన్ కళ్యాణ్

బాలల దినోత్సవం సందర్భంగా బాల బాలికలు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. బాలల హక్కుల పరిరక్షణకు, వారి మానసిక వికాసానికి ఈ బాలల దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన నేపథ్యంలో పిల్లలను ప్రాణ సమానంగా ప్రేమించే మన దేశ తొలి ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ జయంతి నాడు బాలల దినోత్సవాన్ని జరుపుకొంటున్నాము. నేటి బాలలే రేపటి పౌరులు అని సర్వదా అంటూ వుంటాము. అయితే పిల్లల హక్కుల పరిరక్షణకు పాటుపడవలసిన ప్రభుత్వ పెద్దలే వారి హక్కులను హరించివేసున్నారు. కనీసం వారు ఇష్టమైన మాధ్యమంలో చదువుకునే అవకాశాన్ని కూడా వారికి లేకుండా చేస్తున్నారు. కనీసం మధ్యాహ్నం వేళ వారికి నాణ్యమైన ఆహారాన్ని అందించలేకపోతున్నారు. చివరకు మా పాఠశాలను తీసేయకండని పసిప్రాయంలో వారు ఆందోళన చేసే పరిస్థితులను పాలకులు సృష్టిస్తున్నారు.ఇదా ఈ వ్యవస్థ పిల్లలకు ఇచ్చే భవిష్యత్తు. బాలల మనోవికాసానికీ ఏమేమి చేయాలో ఐక్యరాజ్య సమితి, జాతీయ అంతర్జాతీయ నిపుణులు ఏనాడో చెప్పారు. ఎలుగెత్తి చాటారు. వాటిని ఆచరించమని ప్రభుత్వ పెద్దలకు మరోసారి మనవి. భారత తొలి ప్రధాన మంత్రి శ్రీ నెహ్రూ జయంతి సందర్భంగా ఆ మహా నాయకుని సేవలను స్మరించుకుంటూ నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన ఆయనకు అంజలి ఘటిస్తున్నాను అని అన్నారు.