నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్

వరుణుడి కారణంగా తొలి టెస్ట్‌లో గెలిచే అవకాశాన్ని కోల్పోయిన టీమిండియా.. సిరీస్‌లో బోణీ చేయాలన్న పట్టుదలతో ఉంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌లో గురువారం నుంచి జరిగే రెండో టెస్ట్‌లో భారత్‌ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ట్రెంట్‌బ్రిడ్జ్‌ టెస్ట్‌ ఆఖరి రోజు వర్షం కారణంగా ఆట సాధ్యం కాకపోవడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియాదే పైచేయిగా కనిపించినా.. టాపార్డర్‌ వైఫల్యం కలవరపాటుకు గురి చేస్తోంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతోపాటు చటేశ్వర్‌ పుజార, అజింక్యా రహానె పేలవ ప్రదర్శన కనబర్చగా.. కేఎల్‌ రాహుల్‌, జడేజా అర్ధ శతకాలతో ఆదుకున్నారు. కాగా, గాయం కారణంగా పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ రెండో మ్యాచ్‌కు దూరం కావడంతో.. కోహ్లీ 4-1 పద్ధతిని మార్చుకోవాల్సి రావచ్చు. నెట్‌ సెషన్‌లో శార్దూల్‌కు కండర గాయం కావడంతో.. అతడి స్థానంలో అశ్విన్‌కు తుది జట్టులో చోటుదక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ నలుగురు పేసర్లుతో దిగాలనుకుంటే ఇషాంత్‌ లేదా ఉమే్‌షకు చాన్స్‌ దక్కొచ్చు. పేస్‌ గన్‌ బుమ్రా గాడిలో పడడం జట్టుకు లాభదాయకం. అతడికి షమి, సిరాజ్‌ నుంచి మంచి సహకారం అందుతోంది.