డేగల మహేష్ హెల్పింగ్ ఫౌండేషన్ సేవలు నిరుపమానం: ఆళ్ళ హరి

గుంటూరు: పేద విద్యార్థులకు, వృద్ధులకు, అన్నార్తులకు డేగల మహేష్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు నిరుపమానమని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. అనంతపురంకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త జనసేన పార్టీ నాయకులు డేగల మహేష్ నేతృత్వంలోని డేగల మహేష్ హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీనివాసరావుతోట, ఆర్ అగ్రహారం, సంపత్ నగర్ లలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు టూత్ పేస్టులను, ఎనర్జీ డ్రింక్ లను పంపిణీ చేశారు. సంస్థ సభ్యులు మిరియాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆళ్ళహరి మాట్లాడుతూ గుంటూరు నగరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనూ, బీసీ, యస్ సీ హాస్టల్స్ లోనూ, గురుకుల పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సుమారు 12 లక్షల రూపాయలు విలువ చేసే ఇరవై వేల పేస్టులను ఫౌండేషన్ ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సేవా సంస్థలు, సమాజ సేవకులు తమ సేవల్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల్లో పంటి సమస్యలు రాకుండా ఉండేందుకు మంచి నాణ్యత కలిగిన టూత్ పేస్టులు అదేవిధంగా శక్తి నిచ్చే ఎనర్జీ ఫ్రూట్ జ్యుస్ లను సంస్థ పంపిణీ చేయటం ఎంతో ముదావహమని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చెన్నా పోతురాజు, బండారు రవీంద్ర, సోమి ఉదయ్, కోనేటి ప్రసాద్, రాజశేఖర్, బుడంపాడు కోటి, సయ్యద్ షర్ఫుద్దీన్, మెహబూబ్ బాషా, సుబ్బారావు దాసరి రాము, నండూరి స్వామి, బాలాజీ, ఆళ్ళ సాయి తదితరులు పాల్గొన్నారు.