పోలీసుల తెలివికి దొంగల దిమ్మతిరిగింది, ఇలా ఎవ్వరూ ఊహించరు!

దొంగల్ని పట్టుకునేందుకు విమానంలో పోలీసులు

తాపీగా బస్సులో వెళ్లిన దొంగలు

ఎదురెళ్లి మరీ అరెస్టు.. దొంగలకు కళ్లు బయర్లు

హైదరాబాద్ నగరంలో జరిగిన ఒక దొంగతనానికి సంబంధించి పోలీసులు చేసిన ఆపరేషన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దొంగలను పట్టుకోవడానికి పోలీసులు ఏకంగా విమానంలోనే వెళ్లారు. దొంగలు మాత్రం బస్సులో తాపీగా తమ స్వగ్రామానికి బయలుదేరారు. సినిమా పక్కిలో చేసిన ఈ ఆపరేషన్లో చివరకు పోలీసులు విజయం సాధించారు. అయితే సినిమా స్టైల్‌లో హైదరాబాద్ నుంచి కోల్‌కతా వరకు ఆపరేషన్ సాగింది. పూర్తి వివరాలివీ.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న ఒక బేకరీలో కొన్ని రోజుల దొంగతనం క్రితం జరిగింది. అందులో ఉన్న దాదాపు రూ.5 లక్షల నగదు చోరీ గురైంది. ఈ విషయమై యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే నాలుగు బృందాలను రంగంలోకి దిగారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీలో దొంగలను పోలీసులు గుర్తించారు. వాచ్‌మేన్ దొంగతనానికి పాల్పడినట్లుగా తేల్చారు. అయితే, అప్పటికే చోరీ చేసిన దొంగలు రాష్ట్రం దాటి పారిపోయినట్లుగా గుర్తించారు. దొంగలను ఎలాగైనా సరే పశ్చిమబెంగాల్‌లో వాళ్ల స్వగ్రామానికి చేరుకునేలోగా పట్టుకోవాలని పోలీసులు ప్లాన్ చేశారు.ఇందులో భాగంగా సాయంత్రం మూడు గంటల సమయంలో కోల్‌కతా వెళ్లే విమానం ఎక్కి బయల్దేరారు. దొంగలు సరిగ్గా 8 గంటల సమయంలో గమ్యం చేరుకున్నారు. దీంతో పోలీసులు ముగ్గురిని పట్టుకున్నారు. చోరీ చేసిన నగదు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.బేకరీలో చోరీ చేసిన తర్వాత వాచ్ మెన్‌తో సహా మరో ముగ్గురు కలిసి తన సొంత గ్రామానికి బయలుదేరారు. ఎంజీబీఎస్ నుంచి విజయవాడ మీదుగా కోల్‌కతాకి బస్సులో ముగ్గురు దొంగలు పయనమయ్యారు. సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేశారు. అయితే చివరి సారిగా బస్సులో ఎక్కడానికి ముందు దొంగలు మాట్లాడిన ఫోన్ కాల్ పోలీసులకు కీలకంగా మారింది. దొంగలు నేరుగా బస్సులో కోల్‌కతాకి వెళ్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. వీరికంటే ముందే అక్కడికి చేరుకున్న పోలీసులు అక్కడ టాక్సీ తీసుకొని బస్సు ఏ రూట్లో వస్తుందో దానికి ఎదురుగా వెళ్లారు. దాదాపు 150 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత బస్సు తారసపడింది.అక్కడే ముగ్గురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులను చూసి దొంగలు షాక్‌కు గురయ్యారు. పోలీసులు ఇచ్చిన ట్విస్ట్‌కి దొంగలకు ఏమీ అర్థం కాలేదు. ముగ్గురు దొంగల్ని పట్టుకున్న తర్వాత వారిని రోడ్డు మార్గం ద్వారా పోలీసులు జూబ్లీహిల్స్‌కు తరలించారు. వారిని రిమాండ్‌కు తరలించారు. అయితే, పోలీసులు హైదరాబాద్ టు కోల్‌కతా చేసిన ఆపరేషన్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.