నియంతృత్వ పోక‌డ‌ల‌ను గుర్తుకు తెస్తున్న వైసీసీ పాల‌న!

  • అర్ధ‌రాత్రి జ‌న‌సేన వ్య‌క్తిగ‌త సిబ్బందిని బెదిరించ‌టం అమానుషం
  • మ‌హిళ‌ల‌కు స‌రైన ప్రాతిధ్యం, గౌర‌వం టీడీపీ-జ‌న‌సేన కూట‌మితో సాధ్యం
  • జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజీ

చిల‌క‌లూరిపేట‌: పీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో వైసీసీ పాలన నియంతృత్వ పోక‌డ‌ల‌ను గుర్తుకు తెస్తుంద‌ని జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజీ అన్నారు. శుక్ర‌వారం ఆయ‌న కార్య‌క్ర‌మంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో బాలాజి మాట్లాడుతూ అర్ధరాత్రి స‌మ‌యంలో జనసేన పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జ‌న‌సేన అధినేత‌ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది, జనసేన మీడియా సిబ్బంది నివసించే గదులలోకి వెళ్లి అక్కడ ఉన్న వాచ్ మెన్ ను పోలీస్ లు ఆయుధాల‌తో బెదిరించి అందరినీ భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసి, వారి గదులలోకి వెళ్లి ఎటువంటి ఆధారాలు చూపకుండా తనిఖీలు చేయ‌డాన్ని ఖండిస్తున్న‌ట్లు తెలిపారు. ప్రజా స్వామ్య వ్యవస్థలో ఉన్నామా లేక నియంత పాలనలో ఉన్నామా అర్థం కావడం లేదని, పోలీసులు వైసీసీ నాయకులకు కొమ్ము కాస్తూ వారు చెప్పినట్లు వ్యవహరించడం దారుణ‌మ‌న్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కొంమంది పోలీసులు, అధికారులు అధికార పార్టీ నాయ‌కుల‌కు తొత్తులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, బాధితుల త‌రుఫున న్యాయం చేయాల్సిన పోలీసు వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా నిర్విర్యం చేశారని మండి ప‌డ్డారు. ప్ర‌జా స్వామ్యంలో అధికారం ఒక‌రి సొత్తు కాద‌ని, బాధిత ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌బ‌డ‌క‌పోవ‌డం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమ‌న్నారు. వైసీపీ చేస్తున్న రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులు పావులుగా మారడం అప్రజాస్వామికమ‌న్నారు. ఆకాశంలో సగం.. మ‌న‌లో స‌గ‌మై నిలిచిన మ‌హిళ‌ల‌కు స‌రైన ప్రాతిధ్యం, గౌర‌వం టీడీపీ-జ‌న‌సేన కూట‌మి అధికారంలోకి రావ‌డం ద్వారా ల‌భ్య‌మౌతాయని బాలాజి తెలిపారు. అంత‌ర్జాతీయ మ‌హిళ దినోత్స‌వం సంద‌ర్బంగా ఆయ‌న వీరమ‌హిళ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.