ఆన్ లాక్ 5.0లో భాగంగా థియేటర్లు రీ ఓపెన్

గడిచిన ఆరునెలలుగా థియేటర్లు మూతపడి ఉన్నాయి. దీంతో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులంతా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. థియేటర్లు మూతపడటంతో ప్రేక్షకులంతా ఓటీటీలకు అలవాటు పడ్డారు. ఇక తాజాగా ఆన్ లాక్ 5.0లో భాగంగా థియేటర్లు రీ ఓపెన్ కాబోతున్నాయి. అక్టోబర్ 15 నుంచి థియేటర్లలో 50శాతం అక్యుపెన్సీతో ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.

దేశం మొత్తం మీద థియేటర్ల మీద బతికే వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంది. ఆరు నెలలుగా థియేటర్లు లేకపోవడంతో వీరంతా చాలా బాధలు పడ్డారు. కొంతమంది వేరే పనులు చూసుకున్నారు. కొంతమంది థియేటర్లను అమ్మేసుకున్నారు. సినిమా వాళ్ళల్లో వాళ్ళ సినిమాలను ఓటిటికి అమ్ముకొని కొంచెమన్నా సేఫ్ అయ్యారు. కానీ థియేటర్ల పరిస్థితి అలా లేదు. థియేటర్ల సంఘాలు, మల్టీప్లెక్స్ ఓనర్లు కేంద్రానికి ఇటీవల థియేటర్లు తెరవడానికి పర్మిషన్ ఇమ్మని లేఖ కూడా రాశారు.

ఇక తాజాగా అన్ లాక్ 5.0లో భాగంగా అక్టోబర్ 15 నుంచి థియేటర్లలో 50శాతం అక్యుపెన్సీతో ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం మార్గదర్శకాలను జారీ చేయడం తో థియేటర్ యాజమాన్యాలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇన్నాళ్లు బూజు పట్టిపోయిన తమ థియేటర్లను అందంగా ముస్తాబు చేయడానికి రెడీ అవుతున్నారు. కరోనా ఎఫెక్ట్ తో ఇప్పటికే థియేటర్లలో రావాల్సిన సినిమాలన్నీ ఓటీటీ వైపు మళ్లాయి. థియేటర్లలో రిలీజ్ అయితే కలెక్షన్స్ కూడా బాగా వచ్చేవి. చాలా మందికి ఉపాధి దొరికేది. మరి ఇకపై మళ్ళీ థియేటర్లలో సినిమాలు రిలీజ్ చేస్తారా?  50 శాతం అక్యుపెన్సీ తో థియేటర్ ని రన్ చేయగలరా అని ఆలోచించాలి. ఇంతకుముందు ఒక సినిమా రిలీజ్ అయిందంటే సినిమా థియేటర్ల దగ్గర జాతరలా ఉండేది. మరి ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తుందా? ఇలాంటి పరిస్థితుల్లో సినిమా థియేటర్లకు జనాలు వస్తారన్నది కూడా అనుమానమే? చూడాలి మరి.. కానీ రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలకు, షూటింగ్ అయిపోవచ్చిన సినిమాలకు పండగే.