పవన్‌కల్యాణ్‌ మాటల్లో వాస్తవం ఉంది: నాని

తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు వాస్తవమని నటుడు, నేచురల్‌స్టార్‌ నాని అన్నారు. శనివారం సాయంత్రం ‘రిపబ్లిక్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను సమర్ధించిన నాని తాజాగా ట్వీట్‌ చేశారు. ‘పవన్‌కల్యాణ్‌ సర్‌కి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మధ్య ఉన్న విభేదాలను పక్కన పెడితే.. సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆయన చెప్పిన మాటలు వాస్తవం. ఆ సమస్యలపై త్వరితగతిన దృష్టి సారించాలి. సినీ పరిశ్రమ తిరిగి పూర్వవైభవం సొంతం చేసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్‌, ఆయా శాఖల మంత్రులు దయచేసి చర్యలు చేపట్టాలని కోరుతున్నాను’ అని నాని పేర్కొన్నారు.

‘ఆంధ్రప్రదేశ్‌లో సినిమాలు ఆపేసి లక్షల మంది పొట్టగొడుతున్నారు. పవన్‌కల్యాణ్‌ సినిమాను ఆపేసినా, అతనొచ్చిన చిత్ర పరిశ్రమని ఆపేసినా అందరూ భయపడి పోయి.. తమ దగ్గరికొస్తారని వైకాపా నాయకులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు జాగ్రత్త’ అంటూ పవన్‌కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సినిమా టికెట్లపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెత్తనం చలాయించేందుకు చూస్తుందంటూ ఆయన మండిపడ్డారు.