రేపు వారికి వ్యాక్సిన్ వేయ‌ట్లేదు!.. వ‌చ్చి బారులు తీరొద్దు.. కేజ్రీవాల్ సూచన

రాజధాని దిల్లీని కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మరణాలూ అదే స్థాయిలో ఉంటున్నాయి. వైరస్‌ వ్యాప్తిని తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే టీకా పంపిణీని వేగవంతం చేసినప్పటికీ.. ప్రజల అవసరాల మేరకు వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారంతా వ్యాక్సిన్లు చేయించుకోవచ్చని కేంద్రం చెప్పినప్పటికీ సరిపడా నిల్వలు లేకపోవడంతో రాష్ట్రాలు చేతులెత్తేస్తున్నాయి. వ్యాక్సిన్ల కొరత రాజధాని ప్రాంతంలో మరింత తీవ్రంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రానికి తగినన్ని టీకాలు రానందున.. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వారు శనివారం టీకాల కోసం వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు రావొద్దని సూచించారు.

”దయచేసి వ్యాక్సిన్‌ కేంద్రాల ఎదుట బారులు తీరొద్దు. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన వెంటనే మీ అందరికీ తెలియజేస్తాము. అప్పుడు వచ్చి వ్యాక్సిన్లు వేయించుకోండి”అని కేజ్రీవాల్‌ ప్రజలకు సూచించారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామని, రానున్న మూడు నెలల్లో 67 లక్షల డోసులు అందించాలని కోరినట్లు అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. వచ్చే మూడు నెలల్లో రాజధాని ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రెండు మూడు రోజుల్లో నాలుగు లక్షల కొవిషీల్డ్‌ టీకాలు వస్తాయన్నారు.