మూడో టెస్ట్: తొలిరోజు ఆసీస్’దే ఆధిపత్యం

సిడ్నీ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌ మ్యాచ్‌కు వర్షం కారణంగా పలు దపాలుగా అంతరాయం కలిగింది. తొలి రోజు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆట నిలిచే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. అయితే మ్యాచ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే వర్షం కురవడంతో తొలి సెషన్‌లో ఆట 7.1 ఓవర్లు మాత్రమే సాగింది. అప్పటికే ఆస్ట్రేలియాకు గట్టి దెబ్బ తగిలింది. భారత బౌలర్ సిరాజ్ ఓపెనర్ వార్నర్‌ను ఔట్‌ చేసి భారత్‌కు శుభారంభం ఇచ్చాడు. ఈ క్రమంలోనే భోజన విరామ సమయానికి సైతం వర్షం ఆగకపోవడంతో అరగంట ముందే తొలి సెషన్‌ను ముగించారు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోర్‌ 21/1గా నమోదైంది.

నాలుగు గంటల తర్వాత మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది. అప్పటికి క్రీజులో ఉన్న యువ బ్యాట్స్‌మన్‌ పకోస్కీ, వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ మార్నస్‌ లబుషేన్‌ శతక భాగస్వామ్యం నిర్మించారు. ఈ క్రమంలోనే పకోస్కీ అందించిన రెండు క్యాచ్‌లను పంత్‌ జార విడిచాడు. అయితే, అర్ధశతకం పూర్తి చేసుకొన్న అతడిని సైని ఔట్‌ చేశాడు. అప్పటికి ఆసీస్‌ స్కోర్‌ 106/2గా నమోదైంది. పకోస్కీ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన స్టీవ్‌స్మిత్‌ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. మార్నస్‌ లబుషేన్(67; 149 బంతుల్లో 8×4), స్టీవ్‌స్మిత్‌(31; 64 బంతుల్లో 5×4) ప్రస్తుతం క్రీజులో నిలిచారు. దీంతో మరో వికెట్‌ పడకుండా ఆస్ట్రేలియా తొలి రోజు ఆటను పూర్తి చేసుకుంది.