ఖమ్మం జిల్లాలో షర్మిల పోటీ చేయబోయే నియోజకవర్గం ఇదే!

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా వైయస్ షర్మిల వడివడిగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన ఆమె… అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. వచ్చే నెల 9వ తేదీన ఖమ్మంలో నిర్వహించబోతున్న భారీ బహిరంగసభలో తన పార్టీ పేరును ఆమె ప్రకటించనున్నారు.

మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె సభకు ప్రభుత్వం అనుమతించే అవకాశాలు లేవనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం ఉత్కంఠను లేవనెత్తుతోంది. ఇదిలావుంచితే, ఈ సభకు సంబంధించి ఇప్పటి వరకైతే మైదానానికి అనుమతి వచ్చింది. కానీ, పోలీసు శాఖ నుంచి మాత్రం అనుమతి రాలేదు.

దీనిపై షర్మిల మాట్లాడుతూ, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభను నిర్వహించి తీరుతామని అన్నారు. తమను ఆపే శక్తి ఎవరికీ లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగుతానని తెలిపారు. తన తండ్రి వైయస్ కు పులివెందుల ఎలాగో.. తనకు పాలేరు అలాగని చెప్పారు.