నేడు భారత్‌కు మరో మూడు రాఫెల్‌ యుద్ధ విమానాలు

న్యూఢిల్లీ: మరో మూడు రాఫెల్‌ ఫైటర్‌ జెట్లు బుధవారం భారత్‌కు చేరుకోనున్నాయి. మూడు రాఫెల్‌ యుద్ధ విమానాలు తీసుకువచ్చేందుకు భారత వైమానిక బృందం ఇటీవల ఫ్రాన్స్‌ చేరుకుంది. ఫైటర్‌ జెట్లు ఇవాళ రాత్రి 7 గంటల వరకు ఫ్రాన్స్‌ నుంచి నేరుగా గుజరాత్‌కు చేరున్నాయి. మధ్యలో యూఏఈలో ఇంధనం నింపుకోనున్నాయి. భారత్‌ 2016 సెప్టెంబర్‌లో ఫ్రెంచ్‌ ప్రభుత్వంతో రూ.59వేల కోట్లతో 36 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి విడతలో ఫ్రెంచ్‌ కంపెనీ డసాల్ట్‌ ఏవియేషన్‌ ఐదు యుద్ధ విమానాలను సరఫరా చేయగా.. గతేడాది జూలై 28న దేశానికి చేరుకున్నాయి.

ఇప్పటి వరకు 11 యద్ధ విమానాలు భారత్‌కు చేరగా.. వాటిని భారత వైమానిక దళం గోల్డెన్‌ ఆరోస్ స్క్వాడ్రన్‌లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం రాఫెల్‌ యుద్ధ విమానాలను లడఖ్‌ సరిహద్దులో మోహరించారు. వీటి రాకతో గోల్డెన్‌ ఆరోస్‌ స్క్వాడ్రన్‌ బలం 14కు చేరుకోనుండగా.. భారత వైమానిక దళం మరింత పటిష్టం కానుందని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. మరో ఐదు యుద్ధ విమానాలు ఏప్రిల్‌ చివరి వరకు భారత్‌కు అప్పగించనున్నట్లు ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్ మంగళవారం పేర్కొన్నారు.