బ్రిటన్‌ ప్రజలను వణికిస్తున్నకొత్త రకం వైరస్‌

బ్రిటన్‌ సహా దక్షిణాఫ్రికా దేశాల్లో కొత్త రకం కరోనా వైరస్‌ కలకలం రేపుతున్నది. బ్రిటన్‌లో ఈ వైరస్‌ అడ్డూ అదుపూ లేకుండా విస్తరిస్తున్నదని ప్రభుత్వం ప్రకటించింది. ఈనేపథ్యంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో కఠిన నిబంధనలతో మళ్లీ లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నది. నెదర్లాండ్స్‌, బెల్జియం సహా పలు దేశాలు బ్రిటన్‌కు విమానాలు, రైళ్ల రాకపోకలను నిలిపివేశాయి. మరికొన్ని దేశాలు కూడా ఆంక్షలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. కాగా, కరోనా స్ట్రెయిన్‌ సంక్షోభంపై బ్రిటన్‌ ప్రభుత్వం సోమవారం అత్యవసరంగా సమావేశం కానుంది.

సెప్టెంబర్‌ నెలలో దేశంలో ఓ రోగిలో కొత్తరకం కరోనాను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్‌ వేగంగా విస్తరిస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. అయితే ఇది కరోనా వైరస్‌ కంటే ప్రమాదకరమై నదని చెప్పడానికి ప్రస్తుతం ఆధారాలు లేవని ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు. ఈ మహమ్మారిని ఏమాత్రం తేలికగా తీసుకోవద్దని హెచ్చరించారు. వైరస్‌ ప్రభావాన్ని గుర్తించేందుకు శాస్త్రవేత్తలు కృషిచేస్తున్నారని వెల్లడించారు. ఈ కొత్తరకం వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)ను కూడా అప్రమత్తం చేశామన్నారు. కొత్త వైరస్‌ వల్ల తమ దేశంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని బ్రిటన్‌ ఆరోగ్య మంత్రి మ్యాట్‌ హాంకాంగ్‌ అన్నారు.

ఈనేపథ్యంలో అప్రమత్తమైన బ్రిటన్‌ ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్‌ బాటపట్టింది. అత్యవసర సేవలు మినహా ఇతరత్రా వ్యాపార వాణిజ్య కార్యకలాపాలన్నింటినీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. జిమ్‌లు, సినిమా థియేటర్లు, బార్బర్‌ షాపులు రెండు వారాలపాటు మూసిఉంటాయని తెలిపింది. దేశవ్యాప్తంగా రెండు వారాలపాటు టైర్‌-4 స్థాయి ఆంక్షలు విధించింది.

బ్రిటన్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఐరోపా దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా బ్రిటన్ నుంచి విమానాల రాకలపై జనవరి 1వరకు నెదర్లాండ్స్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. విమానాలు, రైళ్ల రాకపోకలను 24 గంటలపాటు నిలిపివేయాలని బెల్జియం నిర్ణయించింది. ఇటలీ, ఆస్ట్రియా కూడా ఇదేతరహా ఆంక్షలు విధించేందుకు సిద్ధమయ్యాయి. బ్రిటన్ సహా దక్షిణాఫ్రికా విమానాలను రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు జర్మనీ తెలిపింది. బ్రిటన్‌ డోవర్‌ పోర్టు నుంచి నౌకల రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారు.

కాగా, ఇటలీలో బ్రిటన్‌ తరహా కరోనా స్ట్రెయిన్‌ బాధితుడిని వైద్యులు గుర్తించారు. బాధితుడు, అతని కుటుబం సభ్యులు కొద్దిరోజుల క్రితం యూకే నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు.