సీఎం పై మండిపడ్డ తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్..!

ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్. ఓట్లు వేసి గెలిపించిన, అమాయక ప్రజలతో జిత్తులమారి జిమ్మిక్కుల రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. వైకాపా నాయకులు, జనసేన పై చేసిన విమర్శలకు కౌంటర్ గా ప్రతి విమర్శల్ని సంధించారాయన. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కిరణ్ రాయల్ తో పాటు జనసేన నేతలు రాజారెడ్డి, రాజేష్ యాదవ్, బాబ్జి, హేమ కుమార్, సుమన్ బాబు, మునస్వామి, కీర్తన, అమృత, అరుణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అంశాన్ని సీఎం జగనే లేవనెత్తుతాడు…మళ్లీ ఆయనే పరిష్కరిస్తున్నట్లు మన్ననలు పొందేలా వ్యూహం రచిస్తాడని విమర్శల బాణాలు సంధించారు. ప్రపంచంలోనే సరికొత్త పనికిమాలిన రాజకీయాలకు తెరలేపింది జగనే అని కిరణ్ రాయల్ అన్నారు. కరోనా కష్టాల్లో ఉన్న సినీ పరిశ్రమను ఆదుకునేందుకు సీఎం జగన్ తో మాట్లాడడానికి తమ మెగాస్టార్ చిరంజీవి వచ్చారే తప్ప, మంచు విష్ణు అన్నట్లు… మా చిరంజీవి స్వప్రయోజనాల కోసం పోలేదని స్పష్టం చేశారు కిరణ్ రాయల్. తిరుపతి ఎంపీ… రాయలసీమ ఎంపీగా వ్యవహరిస్తున్నారని, ఓట్లు వేసి గెలిపించిన తిరుపతి పార్లమెంటు పరిధిలోని ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నడిగుడి రైల్వే ప్రాజెక్టుని గాలికి వదిలేశారని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని కిరణ్ రాయల్ హితవుపలికారు. వైసీపీ నేత సజ్జల… చంద్రబాబు దత్తపుత్రుడిగా జనసేన చీఫ్ పవన్ ను విమర్శించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ వ్యవస్థాపకులు రాష్ట్ర ప్రజల దత్తపుత్రుడని కొనియాడారు కిరణ్ రాయల్. వైకాపా జెండా పట్టుకుంటే… మెంటల్ స్టార్ ని కూడా మెగాస్టార్ తో సమానంగా సీఎం జగన్ తన పక్కన కూర్చోపెట్టుకుంటారని దుయ్యబట్టారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని సీఎం అయిన జగన్.. ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కిన తర్వాత ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వ పాలన పై జనం భయం, ఆందోళనతో ఉన్నారని… తదుపరి సీఎం గా మా అధ్యక్షుడు పవన్ నే ప్రత్యమ్నాయం గా చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో జిల్లాలను విడదీసి… జిల్లాల వారీగా చిచ్చు పెడుతూ ముఖ్యమంత్రి జగన్నాటకం ఆడుతున్నారని
కిరణ్ రాయల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.