నేడు రాజధాని రైతుల మహాపాదయాత్రకు విరామం

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ మహా పాదయాత్ర ఎలాంటి అంతరాయాలు లేకుండా కొనసాగుతోంది. అయితే, ఈరోజు కార్తిక సోమవారం, నాగుల చవితి కావడంతో షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పాదయాత్రకు ఈరోజు విరామం ఇచ్చారు. ప్రస్తుతం పాదయాత్ర ఇంకొల్లుకు చేరుకుంది. ఇప్పటి వరకు రైతులు 96.3 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. రేపటి నుంచి పాదయాత్ర యథావిధిగా కొనసాగుతుందని రైతులు తెలిపారు.

కార్తీక సోమవారం సందర్భంగా ఇంకొల్లులో పాదయాత్ర క్యాంపు వద్ద మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వరస్వామి ప్రత్యేక రథం వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్ మనసు మారి ఇప్పటికైనా ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించేలా ఆయనకు బుద్ధినివ్వాలని దేవుడిని ప్రార్థించామని చెప్పారు.